న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రజల భద్రత రానురానూ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఢిల్లీలో రోడ్డుపై ఒక తోపుడు బండిలో కూరగాయలు అమ్ముకుంటున్న యువకుడిపై జరిగిన దాడి దేశ రాజధానిలో శాంతి భద్రతలపై అనుమానాలు రేకెత్తించింది. ఢిల్లీలోని యమున విహార్లో జులై 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టపగలు సాయంత్రం 4.30 సమయంలో నడి రోడ్డుపై జరిగిన ఈ దోపిడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
दो बदमाशो ने एक सब्ज़ी बेचने वाले को लूटा।
— Rahul Agarwal (@ImRa1999) July 24, 2024
यमुना विहार, नॉर्थ ईस्ट दिल्ली। @gharkekalesh pic.twitter.com/E7xXzDSqpO
వీడియోలో ఏముందంటే.. కూరగాయలు అమ్ముకునే ఒక యువకుడు తోపుడు బండిని తోసుకుంటూ నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని యమున విహార్లోని ఒక వీధిలోకి వెళ్లాడు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఇతను తప్ప రోడ్డుపై ఎవరూ కనిపించలేదు. అదే అదనుగా భావించిన ఇద్దరు యువకులు దారి కాచి ఆ యువకుడి పక్కగా వెళుతున్నట్లుగా ఒక యువకుడు వెళ్లాడు. బాధిత యువకుడిని మెడను గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఇంతలో మరో యువకుడు కూడా రానే వచ్చాడు. ఆ ఇద్దరు యువకులు కూరగాయలు అమ్ముకునే ఆ యువకుడిపై దాడి చేసి డబ్బులు లాక్కుని అక్కడి నుంచి పారిపోయారు. ఇంత జరిగినా అక్కడ ఇళ్ల నుంచి ఏ ఒక్కరూ బయటకు కూడా రాకపోవడం కొసమెరుపు. పారిపోతున్న ఆ యువకులను బాధితుడు వెంబడించేందుకు ప్రయత్నించాడు.
దేశ రాజధాని ఢిల్లీలో ఏమాత్రం భయం లేకుండా ఒక యువకుడిపై ఈ తరహా దాడి జరగడంపై నెటిజన్లు విస్తుపోయారు. అసలు ఆ యువకులకు అంత ధైర్యం రావడానికి ఢిల్లీ పోలీసుల అలసత్వ వైఖరే కారణం అనే విమర్శలు కొందరు నెటిజన్ల నుంచి వస్తుండటం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. అదృష్టవశాత్తూ బాధితుడికి ఎలాంటి హాని జరగకపోవడం కొంతలో కొంత ఊరటనిచ్చిన విషయం అని నెటిజన్లు కామెంట్ చేశారు. దేశ రాజధానిలోనే ఈ తరహా ఘటనలు జరిగితే ఇత ఇతర నగరాల్లో పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఢిల్లీలో శాంతిభద్రతలపై పోలీసులు ఇకనైనా దృష్టి సారించాలని నెటిజన్లు హిత బోధ చేస్తున్నారు.