- పోలీసుల అదుపులో నిందితుడి తల్లి, తమ్ముడు
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలో సంచలనం సృష్టించిన షెట్పల్లి అలేఖ్య హత్య కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ డి.మోహన్, ఎస్ఐ లింబాద్రి తెలిపారు. హత్యకు ప్రోత్సహించిన నిందితుడి తల్లి, తమ్ముడిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం స్థానిక పోలీస్ సర్కిల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన జె.శ్రీకాంత్ అనే యువకుడు అదే కాలనీకి చెందిన అలేఖ్యను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధించేవాడు. పెళ్లి చేసుకోవాలని యువతిని బెదిరించినా అతడి మాట వినకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. శ్రీకాంత్ఈ నెల 8న కొబ్బరికాయలు నరికే కత్తితో అలేఖ్యపై దాడి చేసి హత్య చేశాడు. హత్యకు నిందితుడు తల్లి సత్తవ్వ, తమ్ముడు శివకృష్ణ ప్రోత్సహించారు. హత్య అనంతరం వీరిద్దరూ పరారీలో ఉన్నారు. మండలంలోని బాదనకూర్తి చెక్ పోస్టు వద్ద వీరిద్దరినీ అదుపులో తీసుకున్నట్లు సీఐ తెలిపారు. కోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ డి.మోహన్ తెలిపారు.
నిందితులకు త్వరగా శిక్ష పడేలా సీఎంతో మాట్లాడుతా..
అలేఖ్య హత్య కేసులో నిందితులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతానని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం మృతురాలి బాధితరాలు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి అలేఖ్య చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అలేఖ్య మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇదివరకే తాను నిర్మల్ ఎస్పీతో మాట్లాడినట్లు చెప్పారు.
ఈ విషయాన్ని జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క సీరియస్ గా తీసుకున్నారన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు దయానంద్, షబ్బీర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం, వార్డు కౌన్సిలర్ శంకర్ తో పాటు తదితరులున్నారు.