కాంగ్రెస్ ఖాతాలోకి మరో రెండు బల్దియాలు

  •     హాలియా,  నందికొండ మున్సిపాలిటీలు హస్తగతం    
  •     హాలియా చైర్ పర్సన్‌గా యడవల్లి అనుపమ నరేందర్ రెడ్డి
  •     వైస్ చైర్ పర్సన్‌గా పిల్లి చంద్రకళ ఆంజనేయులు

హాలియా, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఆరు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ మరో రెండిండిని తన ఖాతాలో వేసుకుంది.  నల్గొండ జిల్లా హాలియా, నాగార్జున సాగర్​(నందికొండ) మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను చేజిక్కించుకుంది.  శుక్రవారం హాలియా మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్‌‌, మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో  చైర్ పర్సన్ , వైస్ చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించారు.   

చైర్ పర్సన్‌గా 2వ  వార్డు కౌన్సిలర్ యడవల్లి అనుపమ నరేందర్ రెడ్డిని  12వ వార్డు కౌన్సిలర్ చింతల చంద్రారెడ్డి ప్రతిపాదించగా మూడవ వార్డ్ కౌన్సిలర్ అన్నేపాక శ్రీనివాస్  బలపరిచారు. వైస్ చైర్ పర్సన్ గా ఆరో వార్డు కౌన్సిలర్ పిల్లి చంద్రకళ ఆంజనేయులును ఏడవ వార్డు కౌన్సిలర్ ప్రసాద్ నాయక్ ప్రతిపాదించగా నాలుగో వార్డు  కౌన్సిలర్ గౌని సుధారాణి బలపరిచారు.  చైర్ పర్సన్‌ స్థానానికి  గా యడవల్లి అనుపమ నరేందర్ రెడ్డి,  వైస్ చైర్ పర్సన్‌ స్థానానికి పిల్లి చంద్రకళ ఆంజనేయులు సింగిల్ నామినేషన్లు వేయడంగో ఏక్రగీవంగా ఎన్నికైనట్లు ఆర్డీవో శ్రీనివాసరావు ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయ వీర్ రెడ్డి నూతన చైర్ పర్సన్,  వైస్ చైర్ పర్సన్లను అభినందించారు.

నందికొండ చైర్‌‌పర్సన్‌గా అన్నపూర్ణ 

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ (నందికొండ) మున్సిపల్‌ నూతన చైర్‌పర్సన్‌గా 8వ వార్డు కౌన్సిలర్‌ తిరుమలకొండ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ గా ఆదాసు నాగ రాణి విక్రమ్  ఎన్నికయ్యారు.  శుక్రవారం ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌‌, మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలో సింగిల్ నామినేషన్లు రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌‌ మున్వర్​ అలీ, నాయకులు కర్నాటి లింగారెడ్డి, తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కుందూరు వెంకటరెడ్డి,  కౌన్సిలర్లు చింతల చంద్రారెడ్డి, దీప్తి, గౌని సుధారాణి, మలిగిరెడ్డి లింగారెడ్డి, కాకునురి నారాయణ గౌడ్, మాలే అరుణ, వెంపటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.