- టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్-రుతుజ, మెన్స్ స్క్వాష్ టీమ్‌కు గోల్డ్
హాంగ్జౌ: ఇండియా టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్న ఆసియా గేమ్స్‌కు గోల్డెన్ ఫినిషింగ్ ఇచ్చాడు. తన చివరి గేమ్స్‌లో రుతుజ భోసలేతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఇంకోవైపు మెన్స్ స్క్వాష్ టీమ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీతో ఇండియాకు పదో గోల్డ్ అందించింది.
షూటింగ్‌లో సిల్వర్ మెడల్, అథ్లెటిక్స్‌లో రెండు పతకాలు లభించాయి. శనివారం రెండు గోల్డ్ సహా ఐదు మెడల్స్ సాధించిన ఇండియా బ్యాడ్మింటన్, హాకీ, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్‌లోనూ అదరగొట్టింది. గేమ్స్‌లో ఇప్పటిదాకా 10 గోల్డ్ , 14 సిల్వర్ మరో 14 బ్రాంజ్‌లతో మొత్తం 38 మెడల్స్ సాధించిన ఇండియా నాలుగో స్థానంలో ఉంది.
సూపర్ ఫినిషింగ్
మెన్స్ డబుల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోనే ఓడిన టెన్నిస్ స్టార్ బోపన్న మిక్స్‌డ్‌లో మాత్రం సూపర్ పెర్ఫామెన్స్ చేశాడు. తనదైన భారీ సర్వీసులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయగా.. రుతుజ కీలక టైమ్‌లో అదరగొట్టింది. దాంతో ఓ సెట్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకున్న ఇండియా జోడీ ఫైనల్లో 2–6, 6–3, 10–4తో చైనీస్ తైపీ జంట సుంగ్ హవో హువంగ్–ఎన్ షువో లియంగ్‌పై విజయం సాధించింది.
ఫస్ట్ సెట్‌లో రుతుజ సర్వీస్‌లు, రిటర్న్‌ల్లో ఇబ్బంది పడగా.. వరుస పాయింట్లు నెగ్గిన తైపీ జోడీ ఈజీగా సెట్ గెలిచింది. కానీ, గొప్పగా పుంజుకున్న రుతుజ రెండో సెట్‌లో అద్భుతమైన రిటర్న్‌లు కొట్టింది. సర్వీస్‌ల్లో కూడా మెరుగైంది. బోపన్న తన సర్వీస్‌లో ఈ సెట్ గెలిచి మ్యాచ్‌ను టై బ్రేక్ తీసుకెళ్లాడు. అక్కడ తన మార్కు భారీ సర్వీసులు కొట్టి 6–1తో ఆధిక్యం అందించగా..రుతుజ పదునైన ఏస్‌తో మ్యాచ్ ముగించింది. మెన్స్ డబుల్స్‌లో సాకేత్–రామ్‌కుమార్ సిల్వర్ నెగ్గగా గేమ్స్ చరిత్రలో అత్యల్పంగా ఇండియా టెన్నిస్ టీమ్ ఈసారి రెండే మెడల్స్‌తో ముగించింది.
ప్రీతి, లవ్లీనా, నరేందర్ పతక పంచ్
బాక్సింగ్‌లో ఇండియాకు మరో మూడు మెడల్స్ ఖాయం అయ్యాయి. 19 ఏండ్ల ప్రీతి పవార్ (54 కేజీ), స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీ) తమ కేటగిరీల్లో సెమీఫైనల్ చేరి కనీసం బ్రాంజ్ ఖాయం చేసుకున్నారు. దీంతో పాటు ప్రీతికి పారిస్ ఒలింపిక్ బెర్త్ కూడా లభించింది. క్వార్టర్ ఫైనల్లో ప్రీతి 4–1తో మూడుసార్లు వరల్డ్ చాంపియన్ మెడలిస్ట్, ఆసియా చాంపియన్ జైనా షెకెర్బెకోవా (కజక్)పై అద్భుత విజయం సాధించింది. లవ్లీనా 5–0తో సెయోంగ్ సుయోన్ సుయోన్ (కొరియా)ను చిత్తు చేసింది. మెన్స్91 కేజీ క్వార్టర్స్‌లో నరేందర్ 5–0 ఇమ్రాన్ (ఇరాన్)ను ఓడించి సెమీస్ చేరాడు. నిశాంత్ దేవ్ (71 కేజీ) క్వార్టర్‌ఫైనల్లో ఓడిపోయాడు.
సరబ్‌జోత్-దివ్య సిల్వర్ షూట్
బర్త్‌డే బాయ్ సరబ్‌జోత్ సింగ్, టీఎస్ దివ్య 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈమెంట్‌లో ఇండియాకు సిల్వర్ అందించారు. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో సరబ్‌జోత్–దివ్య 14–16తో వరల్డ్ చాంపియన్స్ జాంగ్ బోవెన్–జియాంగ్ రాంక్సిన్ (చైనా) చేతిలో ఓడింది. ఇక మెన్స్ ట్రాప్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో తొలి రోజు ముగిసే సరికి హైదరాబాదీ కైనన్ చెనాయ్ 73 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
అథ్లెటిక్స్‌లో డబుల్ ధమాకా
అథ్లెటిక్స్ మెన్స్ 10 వేల మీటర్ల ఈవెంట్‌లో కార్తీక్ కుమార్, గుల్వీర్ సింగ్ తమ పర్సనల్ బెస్ట్ టైమింగ్స్‌తో సిల్వర్, బ్రాంజ్ గెలిచారు. ఫైనల్లో కార్తీక్ 28 నిమిషాల 15.38 సెకండ్లతో రెండో ప్లేస్‌లో నిలవగా, గుల్వీర్ 28 నిమిషాల 17.21 సెకండ్లతో మూడో ప్లేస్ సాధించాడు. విమెన్స్ 100మీ. హర్డిల్స్‌లో ఏపీ అమ్మాయి యెర్రాజి జ్యోతి, మెన్స్ లాంగ్ జంప్‌లో జెస్విన్ అల్డ్రిన్, మురళీ శ్రీశంకర్ ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యారు. కాగా, గోల్ఫ్‌లో మూడో రౌండ్‌లో సూపర్ పెర్ఫామెన్స్ చేసిన స్టార్ గోల్ఫర్ అదితి అశోక్ అగ్రస్థానంతో గోల్డ్ మెడల్ దిశగా దూసుకెళ్తోంది.
8 ఏండ్ల తర్వాత..
స్క్వాష్‌లో ఎనిమిదేండ్ల తర్వాత ఇండియా మెన్స్‌కు గోల్డ్ మెడల్ లభించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టాప్ సీడ్ ఇండియా 2–1తో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించింది. సౌరవ్ ఘోశాల్ నేతృత్వంలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన మెన్స్ టీమ్ స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్ చేసింది. తొలి గేమ్‌లో మహేశ్ 8–11, 3–11, 2–11తో నాసిర్ ఇక్బాల్ చేతిలో ఓడి నిరాశ పరిచాడు. రెండో మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ సౌరవ్ 11–5, 11–1, 11–3తో ఆసిమ్ ఖాన్‌ను చిత్తు చేసి ఇండియాను రేసులో నిలిపాడు. విన్నర్‌ను తేల్చే మూడో గేమ్‌లో ఇండియా యంగ్‌స్టర్ అభయ్ సింగ్ 11–7, 9–11, 8–11, 11–9, 12–11తో నూర్ జమాన్‌ను ఓడించి జట్టుకు బంగారు పతకం అందించాడు. ఇండియా మెన్స్ టీమ్ చివరగా 2014లో గోల్డ్ గెలిచింది.
తొలిసారి ఫైనల్లో మెన్స్బ్యాడ్మింటన్ టీమ్
ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్‌లో ఇండియా మెన్స్ టీమ్ తొలిసారి ఫైనల్ చేరి గోల్డ్ మెడల్‌కు అడుగు దూరంలో నిలిచింది. సెమీస్‌లో ఇండియా 3–2తో కొరియాపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ గెలవగా డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్, అర్జున్–ధ్రువ్ జోడీలు ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. విన్నర్‌ను తేల్చే మూడో సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 12–21, 21–16, 21–14తో గెన్యోప్ చొను ఓడించి టీమ్‌ను ఫైనల్ చేర్చాడు. ఆదివారం చైనాతో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.
ఇండియా 10.. పాకిస్తాన్ 2
మెన్స్ హాకీలో ఇండియా సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. పూల్–ఎ మ్యాచ్‌లో ఇండియా 10–2తో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. దాయాది జట్టుపై టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం. ఇండియా తరఫున హర్మన్‌ప్రీత్ (11, 17, 33, 34వ ని.) నాలుగు గోల్స్ కొట్టగా.. వరుణ్ (41, 54వ ని.), మన్‌దీప్ (8వ ని.), సుమిత్ (30వ ని.), షంషేర్ (46వ ని.), లలిత్ (49వ ని.) గోల్స్ చేశారు. గ్రూప్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే ఇండియా సెమీస్ చేరుకుంది.
సుతీర్థ-ఐహిక కొత్త చరిత్ర
టేబుల్ టెన్నిస్ విమెన్స్ డబుల్స్‌లో ఇండియా ప్లేయర్లు సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ కొత్త చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో సుతీర్థ–ఐహిక 11–5, 11–5, 5–11, 11–9తో వరల్డ్ చాంపియన్స్ చెన్ మింగ్–యిడి వాంగ్ (చైనా)పై సంచలన విజయం సాధించారు. దీంతో సెమీస్‌లోకి అడుగుపెట్టి కనీసం కాంస్యాన్ని ఖాయం చేసుకున్నారు. విమెన్ డబుల్స్‌లో ఇండియాకుఇప్పటిదాకా ఒక్క పతకం కూడా రాలేదు.
చాను చుక్కెదురు..
వెయిట్ లిఫ్టింగ్‌లో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను నిరాశ పరిచింది. . విమెన్స్ 49 కేజీల కేటగిరీలో 191 (స్నాచ్ 83+ క్లీన్ అండ్ జర్క్108) కేజీల బరువు ఎత్తి నాలుగో ప్లేస్‌లో నిలిచింది. స్నాచ్‌లో నిరాశపర్చిన చాను జర్క్‌లో రెండుసార్లు117 కేజీలను లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించి విఫలమైంది. చివరి ప్రయత్నంలో గాయపడిన ఆమెను కోచింగ్ స్టాఫ్ వచ్చి తీసుకెళ్లారు. విమెన్స్ 55 కేజీల్లో బింద్యారాణి దేవి మొత్తం 196 (83+113) కేజీలతో ఐదో ప్లేస్‌తో సరిపెట్టుకుంది.