- గతంలో కరెంట్ పేరుతో కేసీఆర్ దోచుకున్నారని ఫైర్
- మందమర్రిలో రూ.500కే సిలిండర్, గృహజ్యోతి పథకాలు ప్రారంభం
కోల్‌బెల్ట్, వెలుగు: పేద ప్రజలకు అండగా ఉంటూ భరోసా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేసింది. మరో రెండు గ్యారంటీలు త్వరలోనే అమలు చేస్తుంది” అని చెప్పారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని శాంతినగర్‌లో రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాలను మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి వివేక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీలను అమలు చేస్తారని చెప్పారు. ‘‘గృహజ్యోతి పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఈ స్కీమ్ కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. తద్వారా పేదలకు రూ.వెయ్యి వరకు లబ్ధి చేకూరుతుంది” అని అన్నారు. గతంలో కరెంట్ కొనుగోళ్ల పేరుతో మాజీ సీఎం కేసీఆర్ రూ.కోట్లల్లో దోచుకున్నారని మండిపడ్డారు.
కాకా జీవితం అందరికీ ఆదర్శం..
తన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారని.. ఆయన జీవితం అందరికీ ఆదర్శమని వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రిలో సింగరేణి సీఐఎస్ఎఫ్బ్యారక్లో కాంగ్రెస్లీడర్ బండి సదానందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాకా వెంకటస్వామి స్మారక సెవెంత్ సౌతిండియా లెవల్కరాటే, కుంగ్‌ఫూ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘పేద కుటుంబం నుంచి వచ్చిన కాకా వెంకటస్వామి.. పెద్ద ఆలోచనతో పేదలకు సేవ చేయాలని హైదరాబాద్‌లో 70 వేల ఇండ్ల స్థలాలు ఇప్పించారు. అంబేద్కర్కాలేజీల్లో 5 వేల మందికి విద్యనందించేందుకు చొరవ చూపారు. కాకా కేంద్రమంత్రిగా పనిచేసిన టైమ్‌లో అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి రూరల్డెవలప్మెంట్కోసం రూ.25 వేల కోట్ల బడ్జెట్ పెట్టించారు. ప్రభుత్వ, ప్రైవేట్, సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించిన ఘనత ఆయనకే దక్కింది. ఈ విషయాలు ఇప్పటి పిల్లలు తెలుసుకోవాలి. కాకాను రోల్‌మోడల్ గా తీసుకొని ముందుకుసాగాలి” అని సూచించారు. కరాటేతో క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. ఈ పోటీలు ఏర్పాటు చేసినందుకు బండి సదానందంను అభినందించారు. పోటీలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి..
చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడిందని, అన్ని పనులు ఒకేసారి కావని, ఒక్కొక్కటిగా అన్ని పనులు చేస్తామని చెప్పారు. మందమర్రిలోని శ్రీకృష్ణ గార్డెన్స్‌లో కాంగ్రెస్ బూత్‌లెవల్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మందమర్రిలో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు నిధులు విడుదల చేస్తామని వివేక్ హామీ ఇచ్చారు. స్పెషల్ డెవలప్‌మెంట్‌ఫండ్ కింద రూ.15 లక్షలను మందమర్రి, రామకృష్ణాపూర్ఈద్గాల కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూనే, అభివృద్ధి పనులకు అవసరమైన ఫండ్స్ కోసం హైదరాబాద్ వెళ్తున్నాను. రూ.10 కోట్ల ఫండ్స్‌లో 30 శాతం మందమర్రికి కేటాయించాను. వార్డుకు రూ.5 లక్షల చొప్పున రూ.కోటి కేటాయించాను. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దెరాగడిలో అభివృద్ధి పనులు చేపట్టాం” అని తెలిపారు. ప్రజలకు కార్యకర్తలు అందుబాటులో ఉండాలని, కార్యకర్తలకు పార్టీ నాయకులు అండగా ఉండాలని సూచించారు. కాగా, సమస్యలపై పలువురు ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేశారు.