కోల్‌బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లాలో మరో రెండు సింగరేణి బొగ్గు గనులు మూతపడనున్నాయి. ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ మైన్ విస్తరణకు పర్మిషన్ లేకపోవడం, ఆర్కే-6 అండర్ గ్రౌండ్ మైన్‌లో బొగ్గు నిల్వలు అంతరించడంతో వీటిని మూసివేసేందుకు సింగరేణి యాజమాన్యం కసరత్తు చేస్తోంది. గనులు మూసివేయనుండడంతో వేలాది మంది కార్మికులకు ట్రాన్స్‌ఫర్ భయం పట్టుకుంది. సర్వీస్ పూర్తి కావడానికి దగ్గరగా ఉన్న సీనియర్ కార్మికులు ఏళ్లుగా ఉంటున్న ప్రాంతం నుంచి మరో చోటకు వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు గనులు మూతపడితే బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడనుంది. రామకృష్ణాపూర్ పట్టణ మనుగడ దెబ్బతింటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్కేపీ ఓసీపీ ఆరు నెలలే..
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్మైన్లో మరో ఆరు నెలల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. అండర్ గ్రౌండ్బొగ్గు గనుల్లో ఉత్పత్తి కష్టంగా మారిన క్రమంలో ఆర్కే4 అండర్ గ్రౌండ్ మైన్‌తో పాటు ఎంకే 4, ఎంకే 4ఏ గనులను మూసివేసి 2013లో ఆర్కేపీ ఓసీపీని ఏర్పాటు చేశారు. ప్లానింగ్ లోపం, బొగ్గు నిల్వలపై స్పష్టత లేక మొదట్లో బొగ్గు కన్నా ఎక్కువగా మట్టిని వెలికి తీశారు. క్రమంగా బొగ్గు ఉత్పత్తి పుంజుకోవడంతో రూ.250 కోట్ల లాభం వచ్చింది. ఇక్కడ 15.8 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు గుర్తించగా ఇప్పటివరకు 14.96 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీశారు. 2.7 కిలోమీటర్ల పొడవు, 1.5 కిలోమీటర్ల వెడల్పులో 11 సీమ్‌ల ద్వారా 170 మీటర్ల లోతులోని బొగ్గును వెలికితీస్తున్నారు. గనిలో 284 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం గనిలో కేవలం 10 లక్షల టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఐదారు నెలల్లో అవి అయిపోతాయని చెప్తున్నారు. రెండో ఫేజ్ విస్తరణ పర్మిషన్లపై గని మనుగడ ఆధారపడనుంది. మూతపడిన ఆర్కే-1ఏ గని, అంతకుముందే మూసివేసిన ఆర్కే -2, ఆర్కే-3, ఆర్కే-4 (నార్త్ సైడ్) గనుల్లో ఇంకా 34.4 మిలియన్ టన్నులు బొగ్గు నిల్వలు ఉన్నట్లు యాజమాన్యం గుర్తించింది. రెండో ఫేజ్‌లో అటవీ భూమి, పర్యావరణ అనుమతుల కోసం యాజమాన్యం ఏడాదిన్నర కిందట దరఖాస్తు చేసుకుంది. ఓబీ కాంట్రాక్ట్ ఆఫీస్ నుంచి ఆర్కే-3, సీహెచ్‌పీ ముందున్న అటవీ ప్రాంతం మీదుగా పాలవాగు ఒడ్డు వరకు గనిని విస్తరించాలని యాజమాన్యం భావిస్తోంది. ఇందులో 375 హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయి. ఇప్పటివరకు రెండో ఫేజ్పర్మిషన్ రాకపోవడంతో గని మూసివేత తప్పని పరిస్థితి నెలకొంది.
లోతుల్లోని బొగ్గు తీయలేక మరో గని
శ్రీరాంపూర్ ఏరియాలో ఎక్కువ మంది కార్మికులు ఉన్న ఆర్కే 6 అండర్ గ్రౌండ్ మైన్ కూడా మరో ఏడాదిలో మూత పడనుంది. అప్పటి రామకృష్ణాపూర్ ఏరియాలో 1975 ఏప్రిల్4న గని ప్రారంభం కాగా 29.80 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు అంచనావేశారు. గత 49 ఏళ్లలో 14.10 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును వెలికి తీశారు. కొద్ది కాలం గనికి అనుసంధానంగా 6ఏ టన్నెల్ ద్వారా బొగ్గు వెలికితీత జరిగింది. ప్రస్తుతం సుమారు 1000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గనిలో 300 మీటర్ల లోతు వరకు బొగ్గు తవ్వుతున్నారు. బొగ్గు నిల్వలు మరింత లోతులో ఉండడంతో అండర్ గ్రౌండ్ పద్ధతిలో బొగ్గు తీయడం సాధ్యం కాదని భావిస్తున్న యాజమాన్యం గనిని మూసివేసేందుకు సిద్ధమవుతోంది. గనిలో మిగిలిన 15.02 మిలియన్ టన్నుల బొగ్గును ఓపెన్ కాస్ట్ విధానంలో బయటకు తీయాల్సి ఉంటుంది.
కళ తప్పుతున్న రామకృష్ణాపూర్
బొగ్గు గనులతో కళకళలాడిన రామకృష్ణాపూర్ ఏరియాలో వరుసగా ఆర్కే 1, 1ఏ, ఆర్కే 2, ఆర్కే 3, ఆర్కే 4, ఎంకే 4, ఎంకే 4ఏ అండర్ గ్రౌండ్ గనులు మూతపడ్డాయి. ఒకప్పటి రామకృష్ణాపూర్ ఏరియాను 2003లో మందమర్రిలో విలీనం చేయడం, కొన్ని గనులను శ్రీరాంపూర్ ఏరియాలో కలపడంతో ఆర్కేపీ వైభవం తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే చాలా మంది ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. యేడాది కిందట ఆర్కే-1ఏ గనిని మూసి వేయగా వెయ్యి కార్మిక కుటుంబాలు ఇక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఆర్కేపీ ఓసీపీ కూడా మూతపడితే రామకృష్ణాపూర్ కళ తప్పనుంది. ఆర్కేపీ ఓసీపీని మూసివేయకుండా రెండ్ ఫేజ్ పర్మిషన్ కోసం సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర సర్కార్ కృషి చేయాలని కార్మికులు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి.