
మన ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ ముగిసిన వెంటనే.. అగ్రదేశం సంచలన నిర్ణయం తీసుకున్నది. అమెరికాలోని ఇండియాకు చెందిన అక్రమ వలసదారులను.. రెండు ప్రత్యేక విమానాల్లో ఇండియాకు పంపిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు విమానాలు రేపు, ఎల్లుండి అంటే.. 2025, ఫిబ్రవరి 15, 16 తేదీల్లో అమృత్ సర్లో ల్యాండ్ కానున్నాయి.
అమెరికా పర్యటన ముగించుకుని ఇండియా బయలుదేరిన మోదీ విమానం వెనకే.. అక్రమ వలసదారుల రెండు విమానాలు వరసగా బయలుదేరేలా పరిస్థితులు ఉండటం చర్చనీయాంశం అయ్యింది. ట్రంప్తో ప్రధాని మోదీ సమావేశం తర్వాత అయినా వలసదారులపై అమెరికా వైఖరి మారొచ్చనే చర్చ జరిగింది. అలాంటిది ఏమీ లేకుండా.. అమెరికా నుంచి మోదీ బయలుదేరిన వెంటనే.. ఆయన విమానం వెనక.. మరో రెండు విమానాల్లో మనోళ్లను ఇండియాకు పంపించాలని అమెరికా డిసైడ్ కావడం చర్చనీయాంశంగా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారుల తరలింపే లక్ష్యంగా ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెరికా యుద్ధ విమానంలో భారత్లోని అమృత్ సర్కు అక్రమ వలసదారులను డొనాల్డ్ ట్రంప్ పంపించేశారు. అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన ఫస్ట్ బ్యాచ్ విమానం భారత్ చేరిన రోజుల వ్యవధిలోనే మరో రెండు విమానాలు అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారులతో వస్తుండటం గమనార్హం.
టెక్సాస్ నుంచి వచ్చిన సీ-17 మిలటరీ ప్లేన్ పంజాబ్లోని అమృత్‌సర్‌లో ఉన్న శ్రీ గురు రామ్‌దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం(ఫిబ్రవరి 5, 2025) మధ్యాహ్నం 1.55 గంటలకు ల్యాండ్ అయింది. అందులోని 104 మందిలో పంజాబ్‌కు చెందినవారు 30 మంది, హర్యానా, గుజరాత్‌కు చెందినవారు 33 మంది చొప్పున ఉన్నారు.
ALSO READ | ట్రంప్తో మీటింగ్లో..ప్రధాని నోట MIGA +MAGA=MEGA పార్టినర్షిప్ అంటే ..
అమెరికా గడ్డపై విదేశీ పౌరులకు పుట్టే పిల్లలకు ఇకపై ఆటోమేటిక్ సిటిజన్‌షిప్ వర్తించబోదంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అక్కడి ఇండియన్లు తీవ్ర ఆందోళనలో పడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 20 నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి రానుండటంతో ఆలోపే సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుని అయినా పిల్లలను కనాలని ప్రస్తుతం గర్భం దాల్చినవారు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
డెడ్‌లైన్ కంటే ముందే డెలివరీకి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ముందస్తు డెలివరీల కోసం వస్తున్న వారిలో ఎక్కువ మంది ఇండియన్లే ఉన్నారని న్యూజెర్సీలోని ఓ మెటర్నిటీ క్లినిక్ డాక్టర్ ఎస్డీ రమా తెలిపారు. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ పై ట్రంప్ ప్రకటన తర్వాత.. ప్రీ టర్మ్ బర్త్ కోసం చాలా కాల్స్ వస్తున్నట్లు చెప్పారు. ఏడు నెలల గర్భిణులు కూడా సిజేరియన్ చేయాలని కోరుతున్నారని తెలిపారు.