జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : వరదలకు పాడైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని కన్నెపల్లి పంప్‌హౌస్ రెండు మోటార్లను ఆదివారం ఇంజినీర్లు రీస్టార్ట్ చేశారు. దాదాపు 5 నెలల తర్వాత మోటార్ల ద్వారా గోదావరి నీటిని గ్రావిటీ కెనాల్‌లోకి ఎత్తిపోశారు. జులై 14న వచ్చిన భారీ వరదలకు ప్రొటెక్షన్ వాల్ కూలిపోయి కన్నెపల్లి పంప్‌హౌస్ నీట మునిగింది. దాంతో 17 బాహుబలి మోటార్లు ఖరాబయ్యాయి. అప్పటి నుంచి వాటర్ లిఫ్టింగ్ చేయకుండా పంప్‌హౌస్ ను ఆపేశారు. కొన్ని నెలలుగా వందలాదిమంది ఇంజినీర్లు, వేలాది మంది కూలీలు పనిచేసి పంప్‌హౌస్‌ను రిపేర్ చేశారు. పాడైపోయిన 11 మోటార్లను రిపేర్ చేసి వాటర్ పంపింగ్ స్టార్ట్ చేశారు. ఆదివారం నుంచి రోజుకు ఒకటి, రెండు చొప్పున అన్ని మోటార్లను టెస్ట్ చేస్తామని నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం మొదటి, రెండవ మోటార్లను కొద్దిసేపు నడిపి టెస్ట్ చేసి ఆపేసినట్లు ప్రకటించారు.
కొత్త ప్రొటెక్షన్ వాల్, కంట్రోల్ రూం
భారీ వరదలకు కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రొటెక్షన్ వాల్ కూలిపోయి 17 బాహుబలి మోటార్లు నీట మునిగాయి. కంట్రోల్ రూంలు కూడా పూర్తిగా పాడయ్యాయి. రూ.1,200 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఆగస్ట్ లో ఇంజినీర్లు డీ వాటరింగ్ కంప్లీట్ చేసి.. ప్రొటెక్షన్ వాల్ ను మళ్లీ నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. పంప్‌హౌస్ దగ్గరికి ఎవరినీ రానీయకుండా పోలీసులను పెట్టి రహస్యంగా పనులు చేశారు. ఇప్పటికీ పంప్‌హౌస్ దగ్గరికి ఎవరినీ రానివ్వట్లేదు. భవిష్యత్‌లో గోదావరి వరద ఒత్తిడిని తట్టుకునే విధంగా రిపేర్లు చేయాల్సి ఉన్నప్పటికీ కూలిపోయిన చోటు నుంచి మాత్రమే తిరిగి వాల్ కట్టారు. పునాదులు తవ్వకుండా డ్రిల్లింగ్ చేసి తూతూ మంత్రంగా పని కానిచ్చేసినట్లుగా బయట చర్చ జరుగుతోంది. పంప్‌హౌస్ లోపల ఉన్న కంట్రోల్ రూంను ప్రభుత్వం భూమిపైకి తీసుకొచ్చింది. గతంలో మోటార్ల దగ్గర ఉన్న కంట్రోల్ ప్యానెల్స్‌ను ప్రస్తుతం భూమిపై అమర్చారు. విదేశాల నుంచి వచ్చిన ఇంజినీర్ల పర్యవేక్షణలో రిపేర్ వర్క్ జరిగింది.