ఎవరికి మోదం? ఎవరికి ఖేదం?

ఎవరికి మోదం? ఎవరికి ఖేదం?

 తలమీదబరువు దిగిపోయింది. ఫలితాలు రేవంత్​రెడ్డి చెప్పినట్లుగా ఉగాది పచ్చడిగానే ఉన్నాయి. అయితే లెక్కలిక్కడ గీత గీసినట్లుగా ఉన్నా అది దారంలాగ ఉంది. ఉన్నంతసేపు రక్షణ, తెగితే ప్రమాదం. 392 సీట్లతో ఎన్​డీఏ  మళ్లీ మోదీ అధికారంలోకి వచ్చినా  బీజేపీ వ్యవస్థ సంతోషంగా లేదు. 100 సీట్లు దాటకున్నా కాంగ్రెస్​ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. ‘నవ్వేవాడి ముందు జారిపడినట్లు’ బీజేపీ వ్యతిరేక తెలుగు మీడియాకు చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా టీడీపీని అభిమానించే వారికి జగన్​ను పడదోయడం కన్నా మోదీ మన చేతిలో చిక్కాడనే మురిపెం ఎక్కువగా ఉంది.

అయితే ఎన్డీయే పక్షం నేతగా మోదీని ఎన్నుకుంటున్న సమయంలో బాబు, నితీశ్​లు చాలా జాగ్రత్తగా, సంపూర్ణ విశ్వాసం కలిగేటట్లు మాట్లాడితే, మోదీ మాత్రం‘ కాస్త వినయం అవసరం’ కొట్టొచ్చినట్లు కనిపించింది. కానీ ఆయన పెద్దన్న లాగా కన్పించారు. రాజకీయాలు లేకుండా అందరినీ ఆకర్షించే ఉపన్యాసం అకట్టుకుంది.మోదీ గుజరాత్​ సీఎంగా ఎన్నికైనప్పటి నుంచి అప్రతిహితంగా విజయాలు నమోదు చేశాడు. 

ఇపుడు బీజేపీకి 240 సీట్లు సంపాదించినా ఆయన ఏదో తప్పు చేసినట్లు అందరూ వాపోతున్నారు. నిజానికి సీట్లు సాధించినా, పోగొట్టుకోవడానికైనా ఆయనే కారణం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ​పార్టీకి ఘోర పరాజయం చూపించిన రాహుల్ ​గురించి ఎవరూ ఆందోళన చెందడంలేదు. ఎంత వచ్చినా లాభసాటిగా భావిస్తున్నారు. మరి మోదీ విషయంలో ఎందుకింత ఆందోళన?  ఈసారి 400 సీట్లు మోదీ గ్యారంటీ అన్నందుకు ప్రజల ఆకాంక్షలు మోదీపై ఎక్కువ ఉన్నమాట వాస్తవం. 

కొందరు గతంలో వాజ్​పేయి ఎన్డీయే ప్రధానిగా ఉన్నపుడు ఏదో విషయంలో మమతాబెనర్జీ ఇంటికెళ్లి బుజ్జగించాడని పరోక్షంగా మోదీ అలాగే ఉండాలని భావిస్తున్నారు. దాంట్లో ఆయన పెద్దరికం చూడడంకన్నా  ఆయనను ‘వంచామన్న’ వికృతానందం కన్పిస్తున్నది. ఎన్డీయే సమావేశంలో మోదీ కలుపుగోలుగా ఉంటే కూడా ఆయన నటిస్తున్నాడంటున్నారు. సంకీర్ణ ధర్మంలో అదికూడా ఒకటి అని అర్థం చేసుకోలేకపోతున్నారు. 

ఘోర పరాజయమేమీ కాదు

 నిజానికి ఇపుడు కూడా బీజేపీ ఘోర పరాజయం ఏమీ పొందలేదు.  స్వంతంగా 240 సీట్లు పొందడం అంత ఆషామాషీ ఏం కాదు. ఒకవేళ యూపీలో 30 సీట్లు తగ్గకపోతే ఇంత పెద్ద చర్చలేదు.  కాంగ్రెస్​కు స్వంతంగా 99 సీట్లు వచ్చాయి. బీహార్​, యూపీ, తమిళనాడు, ఏపీ వంటి రాష్ట్రాల్లో  తన ప్రభను పూర్తిగా కోల్పోయి మిత్రులపై ఆధారపడింది. ఎస్పీ, తృణమూల్​, డీఎంకే సీట్లు మినహాయిస్తే ఇండీ కూటమికి అస్తిత్వం కనిపించదు. 

నిజానికి ఈ మూడు పార్టీలకు బీజేపీలో ఉన్న  సహజ ప్రత్యర్థి స్వభావం వల్ల దూరంగా ఉన్నాయి తప్ప, వాటికి కాంగ్రెస్​తో పెద్ద ఫెవికాల్​ బంధమేమీలేదు. టీఎంసీ 29, ఎస్పీ 37 సీట్లు డీఎంకే 21 సీట్లు సాధించాయి. ఈ మూడు సుమారు దేశం మొత్తం కాంగ్రెస్​ సీట్లతో సమానం. ఈ నేపథ్యంలో బీజేపీ సాధించిన సీట్లు ఎన్డీఏకు  నేతృత్వం వహించేందుకు అన్ని విధాల అర్హతను కలిగిస్తున్నాయి.

నితిశ్​– బాబు వైఖరి ఎలా? 

చాలామంది ఈ ఇద్దరు భాగస్వాముల వైఖరిని అనుమానిస్తున్నారు. బీహార్​లో 12 సీట్లు, ఆంధ్రలో 16 సీట్లున్న నితీశ్​, బాబులు మోదీని సురక్షితంగా ఉండనిస్తారా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తే, ఏకంగా బ్లాక్​మెయిల్​ చేసి ప్రత్యేక హోదా సాధించాలని కొన్ని పత్రికలు, చానెళ్లు ఎడిటోరియల్స్​ రాస్తున్నాయి. నిజానికి ఎన్టీఆర్​ సంక్షోభం దగ్గర నుంచి వెంకయ్య నేతృత్వంలోని ఇక్కడి బీజేపీ ఎప్పుడూ టీడీపీకి వెన్నుదన్నుగా నిల్చింది.

 బీజేపీలో  కలిసిన ప్రతిసారీ చంద్రబాబు అధికారం పొందారు. కానీ బీజేపీ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో 35 ఏళ్ల వెనక్కి పోయింది. 2018 ఫిబ్రవరి తర్వాత చంద్రబాబు మోదీపై తీవ్రస్థాయికి వెళ్లి ఆఖరుకు  ప్రభుత్వం చివరిదశలో అవిశ్వాస తీర్మానం కూడా పెట్టించాడు. తర్వాత కాలంలో  ఏం జరిగిందో అందరికీ తెలుసు. 

తెలంగాణలో లోక్​సభ ఫలితాలు

పార్లమెంట్​ ఎన్నికల్లో రెండు జాతీయపార్టీల హవా కొనాసాగింది. బీజేపీ–కాంగ్రెస్​ చెరో ఎనిమిది స్థానాలు పంచుకోగా, యథావిధిగా మజ్లిస్​ ఒక స్థానంలో గెలిచింది. ఫినిక్స్​ పక్షిలా లేస్తామంటున్న బీఆర్​ఎస్​ ఘోర పరాజయం పాలైంది. సెన్సెక్స్​లా రోజూ మారుతున్న రాజకీయాలు ఈరోజు బీజేపీ–కాంగ్రెస్​ సూచీలు ఎక్కువ చూపిస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రజల విజ్ఞత గొప్పగానే ఉంది. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పొషించిన కేసీఆర్​కు కాంగ్రెస్​ ను కాదని 2014లో పట్టం గట్టారు. కాంగ్రెస్​ పూర్తి స్థాయిలో ధ్వంసం కాకుండా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 

కానీ అందులో చాలామంది కేసీఆర్​ వైపు వెళ్లారు. తిరిగి 2018లో కూడా కాంగ్రెస్​కు ప్రతిపక్షంగా ఆదరించినా  మళ్లీ గోడ దూకారు. దాంతో దుబ్బాక, హుజూరాబాద్​, జీహెచ్​ఎంసీ, ఎమ్మెల్సీ వంటి వాటిలో ప్రజలు బీజేపీ వైపు నిలబడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ప్రజలు కాంగ్రెస్​ వైపు నిలబడ్డారు. ఇపుడు లోక్​సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్​ తోపాటు బీజేపీని సమానంగా ఆదరించారు. ఇదంతా మనం విశ్లేషిస్తే ప్రజల మనస్తత్వం తెలుస్తుంది.

అలవిమాలిన ఖర్చులు తగ్గాలి

ఇపుడు బీఆర్​ఎస్​ కూడా జార్ఖండ్​ ముక్తి మోర్చా లాగా మారుతున్న వైనం ఆ పార్టీ కార్యకర్తల్లో ఆందోళన పుట్టిస్తోంది. ఒకవేళ బీఆర్​ఎస్​ అమాంబాపతు పార్టీల్లో ఒకటిగా ప్రవర్తిస్తే ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీకాదు. రాజశ్యామల యాగాలు, లోపల కమ్యూనిస్టు నియంతలా ప్రవర్తించిన కేసీఆర్​వలె కాకుండా రేవంత్​ ప్రజాపాలనలో తప్పులు జరగకుండా చూసుకోవాలి.  అలవిమాలిన ఖర్చులు తగ్గించి మళ్లీ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టాలి. అప్పుడు రేవంత్​ సీఎంగా సక్సెస్​ అయినట్టే. అలాగే తెలంగాణ సెంటిమెంట్​కు సంబంధించి అవసరం లేని విషయాలు ముందలేసుకొని అవి సరిగ్గా ల్యాండింగ్​ జరక్కపోతే కేసీఆర్ కు​ మళ్లీ కొత్త ఆయుధాలు ఇచ్చినట్టే!

భాగ్యోదయం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ

ఒకవేళ కాంగ్రెస్​ పాలనలో తప్పటడుగులు పడితే, బీజేపీ  ఎదగడానికి సిద్ధంగా ఉందని మరవొద్దు. ఎందుకంటే పార్లమెంట్​ ఎన్నికల్లో ప్రజలమూడ్​ స్పష్టం అయింది.  అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు ఇప్పుడు లోక్​సభకు 8 సీట్లు గెలవడంతో బీజేపీలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. తెలంగాణ సాధనలో సుష్మాస్వరాజ్​ నేతృత్వంలో గొప్ప మద్దతు లభించింది. కాబట్టి  కేవలం విమోచన దినం కోసం మాత్రమే కాకుండా,  నిజమైన ఇక్కడి సాంప్రదాయక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వారసత్వం బీజేపీ అందిపుచ్చుకుంటేనే ప్రత్యామ్నాయంగా  తెలంగాణలో  దానికి భాగ్యోదయం.

ఆసక్తికరంగా మారిన రాజకీయం

కేంద్రంలో టీడీపీ మద్దతుతో నడిచే బీజేపీకి ఇపుడు తెలుగురాష్ట్రాలు దగ్గర. మరోవైపు కాంగ్రెస్​ సీఎంలలో అన్నిరకాలుగా రేవంత్​రెడ్డి హైలైట్​గా ఆపార్టీకి మారిపోయాడు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో 42 సీట్లున్న రెండు తెలుగురాష్ట్రాలపై మోదీ ఫోకస్​ ఉండనుంది. కాబట్టి ఇపుడు ఢిల్లీ పాలిటిక్స్​ అన్నీ తెలుగురాష్ట్రాల మీదుగా ఉండనున్న సందర్భంలో రాజకీయం ఆసక్తికరంగా ఉండనుందని చెప్పకతప్పదు.

అవసరాలు అనివార్యం

ఇపుడు మళ్లీ బాబు జనసేన ద్వారా బీజేపీకి దగ్గరయ్యాడు. ఇందులో రెండు వైపులా ప్రయోజనం ఉంది. అమరావతితో సహా ఆంధ్ర అభివృద్ధి చెందాలంటే బీజేపీ సహకారం బాబుకు అవసరం. ఒకవేళ టీడీపీ తోక ఆడిస్తే మోదీ–షాలు జగన్​ భుజంపై చేయివేస్తే చాలు అక్కడ ఏం జరుగతదో తెలియనంత అమాయకుడు కాదు చంద్రబాబు! ఇప్పటికే 7 మంది ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతిచ్చారు. కొన్నాళ్లు ఆగితే ఇంకొన్ని ఎలాగూ ఈ గంపలోకి దూకుతాయి. 

అదీగాక అన్ని విధాల నష్టాల్లో ఉన్న ఆంధ్రను ఆర్థికంగా సెట్​ చేసుకోవడం బాబు ప్రాథమిక అవవసరం. ఇక నితీశ్​ ఎన్నో సార్లు అటూ ఇటూ దూకినా మోదీని దూషించలేదు. వాళ్ల మధ్య గౌరవప్రదమైన అవగాహన ఉంది. ఒకవేళ నితీశ్​ నమ్మకద్రోహం చేస్తే బిహార్​ నుంచే ముసలం పుడుతుంది. ఈ దేశంలోని రాజకీయ పరిణతి కలిగిన నాయకుల్లో నితీశ్​, నవీన్​ పట్నాయక్​ ముందు వరుసలో ఉంటారు. కాబట్టి ఇప్పటికిప్పుడు మోదీకి వచ్చిన నష్టం ఏమీలేదు.

- డాక్టర్.
పి. భాస్కర యోగి,
పొలిటికల్, సోషల్​ఎనలిస్ట్​