అప్పుడే పుట్టిన పిల్లలు తారుమారైన ఘటనలు మనం సినిమాల్లో చూస్తుంటాం.. ఇదే తరహా ఘటనలు బయట కూడా పలు ఆస్పత్రుల్లో గతంలో జరిగిన సంఘటనలు చూశాం. తాజాగా ఇదే తరహా ఘటన ఒకటి జగిత్యాల జిల్లాలో జరిగింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో డ్యూటీ నర్సు నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన ఇద్దరు చిన్నారులు తారుమారు అయ్యారు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాలకు చెందిన సల్మాన్ దంపతులకు, కోరుట్లకు చెందిన అన్వర్ దంపతులకు శనివారం (డిసెంబర్ 9న) తెల్లవారుజామున ఇద్దరికీ ఒకే సమయంలో మగ పిల్లలు జన్మించారు. పుట్టిన వెంటనే సంబంధిత డ్యూటీ డాక్టర్స్, సిబ్బంది పసిపిల్లల చేతులకు ట్యాగ్స్ వేశారు. ఆ తర్వాత నాలుగు గంటల పాటు ఇద్దరు పసి పిల్లలను ఇంక్యుబేటర్ లో పెట్టారు. నాలుగు గంటల తర్వాత శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఉదయ అనే డ్యూటీ నర్సు పిసి పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించింది.
అయితే.. ఇక్కడే నర్సు ఉదయ పొరబడ్డారు. ఒకరి బాబును మరోకరికి ఇచ్చారు. పిల్లలను అందించగానే తల్లిదండ్రులు కూడా ఫొటోలు తీసుకుని సంబుర పడ్డారు. సెల్ఫీలు తీసుకున్నారు. మగ పిల్లాడు పుట్టాడని ఆ ఫొటోలను బంధువులకు పంపించుకున్నారు. గంట తర్వాత డ్యూటీ నర్సు తన తప్పిదాన్ని తెలుసుకుంది. కోరుట్లకు చెందిన అన్వర్ దగ్గరకు వచ్చి ఈ బాబు మీ బాబు కాదు అని చెప్పింది. జగిత్యాలకు చెందిన సల్మాన్ దంపతులకు ఇచ్చిన బాబును తీసుకుని వచ్చి అన్వర్ దంపతులకు అప్పగించింది. అన్వర్ దంపతులకు ఇచ్చిన బాబును సల్మాన్ దంపతులకు ఇచ్చింది. దీంతో దీంతో కోరుట్లకు చెందిన అన్వర్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ నర్సు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అన్వర్ మహమ్మద్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. డ్యూటీ నర్సు, సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.