ఓయూలో విద్యార్థుల కోసం రెండు కొత్త వసతి గృహాలు..రూ. 30 కోట్లతో నిర్మాణం

గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంతో రాష్ట్ర గిరిజన శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిష్టినా జె. చోంగ్తు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు.

మౌళిక వసతుల కల్పన, నాణ్యమైన ఉన్నత విద్య కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా గిరిజన విద్యార్థుల వసతి గృహాల నిర్మాణం కోసం గిరిజన శాఖ రూ. 20కోట్ల కేటాయించింది. మరో 300 మంది విద్యార్థినిల వసతి గృహం కోసం రూ. 10 కోట్లు విడుదల చేయనుంది. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దాదాపు 600 మందికి సరిపడే రెండు వసతి గృహాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ఒక్కో ఎకరం చొప్పున భూమిని ఓయూ కేటాయించింది.
 
నిర్మాణ బాధ్యతలు పూర్తిగా గిరిజన సంక్షేమ శాఖనే చూసుకుంటుంది. వసతి గృహాల నిర్మాణం పూర్తయ్యాక... మౌళిక వసతులతో సహా గిరిజన సంక్షేమశాఖ ఓయూకు అప్పగించనుంది.