తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఆర్టీసీ డిపోలు

  • ప్రజా ప్రభుత్వంలోనే ఆర్టీసీ అభివృద్ధి:  మంత్రి పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా రెండు ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో, ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో డిపోను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో గడిచిన పది, పదిహేను ఏండ్లలోకొత్త డిపోలు ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇది తనకు బాగా సంతృప్తినిచ్చిందన్నారు. ఈ రెండు కొత్త డిపోల ద్వారా మూడు రాష్ట్రాల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం అందనుందన్నారు. ఈ డిపోల నిర్మాణాలను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ఆర్టీసీ ఆర్థిక కష్టాలను అధిగమించి అభివృద్ధి పథంలో ముందుకు పోతోందని అనడానికి ఈ రెండు కొత్త డిపోల ఏర్పాటే నిదర్శనమని మంత్రి పొన్నం పేర్కొన్నారు.