
మంగళూరు: బెంగళూరు విమానాశ్రయంలో ఇద్దరు నైజీరియన్ మహిళలను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు యువతుల వద్ద నుంచి 37 కేజీల డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ 75 కోట్ల రూపాయలని పోలీసులు చెప్పారు. కర్ణాటకలో ఇప్పటిదాకా వెలుగుచూసిన డ్రగ్స్ రాకెట్స్లో ఇదే అతి పెద్ద వ్యవహారం కావడం గమనార్హం. ఆ ఇద్దరు యువతులను నైజీరియాకు చెందిన బంబా ఫ్యాంటా(31), అబిగలి అడొనిస్(30)గా పోలీసులు గుర్తించారు.
ఢిల్లీ నుంచి బయల్దేరిన ఈ ఇద్దరు మహిళలను బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోగానే అరెస్ట్ చేశారు. వాళ్ల ట్రాలీ బ్యాగుల్లో MDMA మాదక ద్రవ్యాన్ని పోలీసులు గుర్తించారు. మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ఈ అరెస్ట్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆ ఇద్దరు యువతుల వద్ద నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ తో పాటు 4 మొబైల్ ఫోన్లను, పాస్ పోర్ట్ లను, 18 వేల ఇండియన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఈ ఇద్దరు మహిళలు ఢిల్లీలో ఉంటూ MDMA మాదక ద్రవ్యాన్ని ఇండియాలో వివిధ నగరాల్లో గుట్టుచప్పుడు కాకుండా సప్లై చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. డ్రగ్స్ ను కస్టమర్లకు చేరవేయడానికి ఈ ఇద్దరు యువతులు విమాన ప్రయాణాలను ఎంచుకోవడం కొసమెరుపు.
గత ఏడాది కాలంలో ఢిల్లీ నుంచి ముంబైకి 37 ట్రిప్పులు, బెంగళూరుకు 22 ట్రిప్పులు విమానాల్లో ఈ ఇద్దరు మహిళలు తిరిగి డ్రగ్స్ సప్లై చేసినట్లు విచారణలో తేలింది. ఫ్యాంటా అనే యువతి 2020లో బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చింది. అడొనిస్ అనే యువతి 2016 నుంచి ఇండియాలోనే ఉంటోంది. గత రెండేళ్లుగా ఈ ఇద్దరూ డ్రగ్స్ రాకెట్ ను నడిపిస్తున్నట్లు మంగళూరు సీపీ అనుపమ్ అగర్వాల్ చెప్పారు.