- తమ కింది ఉద్యోగులే పట్టిస్తున్నారని కలెక్టర్‌కు హెచ్‌వోడీల మొర
- జీతాలు బాగానే వస్తున్నా.. లంచాలు ఎందుకని ప్రశ్నించిన కలెక్టర్
- ఎప్పుడు ఎవరు పట్టుబడతారోనన్న ఆందోళనలో ఆఫీసర్లు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి కలెక్టరేట్‌లో ఏసీబీ ఆఫీసర్లు తిరుగుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుండడంతో ఉద్యోగుల్లో కలకలం మొదలైంది. ముఖ్యమైన పది డిపార్ట్‌మెంట్ల హెచ్‌వోడీలపై ఏసీబీ నిఘా పెట్టిందని తెలియడంతో ఆ డిపార్ట్‌మెంట్లు ఏవి ? అందులో మనం ఉన్నామా ? అని కొందరు ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. ఇదే విషయమై ఇటీవల కొన్ని డిపార్ట్‌మెంట్ల ఆఫీసర్లు కలెక్టర్ పమేలా సత్పతిని కూడా కలిసినట్లు సమాచారం.
వారం రోజుల్లోనే ఇద్దరు ఆఫీసర్లు
యాదాద్రి కలెక్టరేట్‌లో గత నెల 13న ట్రైబర్ వెల్ఫేర్ ఆఫీసర్ మంగ్తానాయక్‌ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. తనకు మంజూరైన రూ. లక్ష బిల్లులో రూ. 50 వేలు ఇవ్వాలని సదరు ఆఫీసర్ డిమాండ్ చేశారని అదే డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ మహిళా ఎంప్లాయ్ ఏసీబీకి సమాచారమిచ్చింది. దీంతో వారు ట్రాప్ చేసి మంగ్తానాయక్‌ను పట్టుకోవడంతో పాటు, అతడి వద్ద రూ. 50 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగి వారం తిరగకముందే ఓ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏసీబీ వలకు చిక్కారు. ఎరువుల షాప్ పర్మిషన్ కోసం రూ. 2 లక్షలు డిమాండ్ చేయడంతో వ్యాపారులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అదే నెల 20న అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ఏవో వెంకటేశ్వర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకొని రూ. లక్ష స్వాధీనం చేసుకున్నారు.
కలెక్టర్‌ను కలిసిన హెచ్‌వోడీలు
వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఆఫీసర్లు ఏసీబీకి పట్టుబడడం, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మంగ్తానాయక్‌ను అదే డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉద్యోగి పట్టించడంతో హెచ్‌వోడీల్లో ఆందోళన మొదలైంది. దీంతో కొన్ని డిపార్ట్‌మెంట్ల హెచ్‌వోడీలంతా కలిసి గత నెల చివరి వారంలో కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి ఏసీబీ దాడులుపై మొరపెట్టుకున్నారు. తమను సొంత స్టాఫే ఏసీబీకి పట్టిస్తున్నారని కలెక్టర్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా ఆఫీసర్లు డబ్బుల కోసం ఒత్తిడి తెస్తే ‘జిల్లా పెద్దల’ దృష్టికి తీసుకొస్తే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని, డైరెక్ట్‌గా ఏసీబీని ఆశ్రయించడం వల్ల డిపార్ట్‌మెంట్‌పరంగా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ ‘జీతాలు బాగానే వస్తున్నాయి కదా ? లంచాలు తీసుకోవడం ఎందుకు ? భయపడడం ఎందుకు ? సబార్డినేట్‌వద్ద పలుచన కావడం ఎందుకు ? అని సీరియస్ అయినట్లు సమాచారం. ‘మాకు ఫిర్యాదు ఇవ్వడం.. మేము నోటీసులు ఇవ్వడం వంటివి ఎందుకన్న ఉద్దేశంతోనే మీ సబార్డినేట్లు నేరుగా ఏసీబీని ఆశ్రయిస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఇప్పటికైనా జాగ్రత్తగాఉద్యోగాలు చేసుకోండి’ అని హితవు పలికినట్టుగా తెలుస్తోంది. దీంతో ఎంతో ఆశతో వెళ్లిన హెచ్‌వోడీలు కలెక్టర్ హెచ్చరికతో మరింత ఆందోళనకు గురయ్యారని సమాచారం.
కలెక్టరేట్‌లో ఏసీబీ ఆఫీసర్లు ?
ఏసీబీ ఆఫీసర్లు గత పది రోజులుగా యాదాద్రి కలెక్టరేట్ ఆవరణలోనే తిరుగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు డిపార్ట్‌మెంట్ల ఆఫీసర్లను పట్టుకోవడం, ఆఫీసర్లు ఇక్కడే తిరుగుతున్నారన్న సమాచారంతో ఎప్పుడు ఎవరు పట్టుబడతారోనని అన్ని డిపార్ట్‌మెంట్ల ఆఫీసర్లు ఆందోళన చెందుతున్నారు.