- డ్రైనేజీ గుంతలో జారిపడి చిన్నారి మృతి
- కలాసిగూడలో విషాదం
- పాలు తెచ్చేందుకు అన్నతో కలిసి బయటకొచ్చిన మౌనిక
- గుంతలో పడి నాలాలో అర కిలోమీటర్ కొట్టుకుపోయిన పాప
- డెడ్‌బాడీని ఫ్లెక్సీలో పోస్టుమార్టంకు తరలించిన సిబ్బంది
- డ్రైనేజీ కోసం గుంతను తవ్వి వదిలేయడంతోనే ప్రమాదం
- మంత్రి తలసానిని నిలదీసిన మౌనిక తల్లిదండ్రులు
- మీ వల్లే తమ బిడ్డ చనిపోయిందని కన్నీరుమున్నీరు
- వరుస ప్రమాదాలు జరుగుతున్నా పట్టింపులేని జీహెచ్ఎంసీ
హైదరాబాద్/ సికింద్రాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో తొమ్మిదేండ్ల చిన్నారిని డ్రైనేజీ కోసం తవ్వి నిర్లక్ష్యంగా వదిలేసిన ఓ గుంత మింగేసింది. పాలప్యాకెట్ కోసం బయటకు వెళ్లిన పాప.. అందులో జారిపడి నాలాలో అరకిలోమీటర్ వరకు కొట్టుకుపోయి శవమై తేలింది. వారం పదిరోజుల నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు, వడగండ్లు పడుతున్నా.. ఇంకిన్ని రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా.. తవ్విన గుంతలను, మ్యాన్‌హోల్స్‌ను మూసివేయాలన్న ఆలోచనలేని అధికారుల తీరు, పట్టింపులేని లీడర్ల వైఖరే తమ బిడ్డను పొట్టనపెట్టుకున్నాయని ఆ పాప తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మూడేండ్ల కింద నేరెడ్‌మెట్‌లో 12 ఏండ్ల చిన్నారి సుమేధ, రెండేండ్ల కింద మణికొండలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి, కుత్బుల్లాపూర్‌లో మరో వ్యక్తి, ఏడునెలల కింద మూసాపేట్లో ఓ యువకుడు.. ఇప్పుడు కలాసిగూడలో తొమ్మిదేండ్ల మౌనిక.. ఇట్లా మ్యాన్‌హోల్స్, గుంతలు, ఓపెన్ నాలాలకు ప్రాణాలు కోల్పోయినా జీహెచ్ఎంసీలో చలనం లేదు. తూతూ మంత్రంగా ఒకరిద్దరు అధికారులపై వేటు వేయడం, ఆ తర్వాత మమ అనిపించడం మామూలైపోయింది.
హైదరాబాద్‌ను శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఎక్కడికక్కడ ఓపెన్ నాలాలు, మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత సికింద్రాబాద్ కలాసిగూడకు చెందిన శ్రీనివాస్, రాధిక దంపతుల కూతురు మౌనిక(9) తన అన్న కార్తీక్‌తో కలిసి పాలప్యాకెట్ తీసుకొచ్చేందుకు బయటకు వచ్చింది. తిరిగి వెళ్లే సమయంలో వర్షం నీటిలో అన్న కార్తీక్ కాలు జారి పడిపోగా.. చేయి పట్టుకుని మౌనిక పైకి లేపింది. ఈ క్రమంలో అక్కడ డ్రైనేజీ కోసం తవ్వి వదిలేసిన గుంతలో మౌనిక పడిపోయింది. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పార్క్ లేన్ నాలాలో ఒక చోట మౌనిక తట్టుకుని ఉండటంతో బయటకు తీసి పరీక్షించగా అప్పటికే మృతిచెందింది.
ఫ్లెక్సీలో డెడ్‌బాడీ తరలింపు
చిన్నారి మౌనిక డెడ్‌బాడీని నాలాలో గుర్తించిన సిబ్బంది.. ఓ ఫ్లెక్సీలో డెడ్ బాడీని ఉంచి గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. జంతు కళేబరాన్ని తరలించిన రీతిలో పాప డెడ్‌బాడీని తరలించడంపై స్థానికులు మండిపడ్డారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మౌనిక మృతికి జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. పోస్టుమార్టం తర్వాత బన్సీలాల్ పేట్లో అంత్యక్రియలు జరిగాయి.
తవ్వి నిర్లక్ష్యంగా వదిలేసిన్రు..
సికింద్రాబాద్‌లోని కలాసిగూడలో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారుల నిర్లక్ష్యమే చిన్నారి మౌనిక ప్రాణాలు తీసిందని స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడ సిబ్బంది డ్రైనేజీ కనెక్షన్ కోసం గుంత తవ్వి ఆ తర్వాత అట్లనే వదిలేశారు. కనీసం అక్కడ బారికేడ్లు, సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. గత వారం పదిరోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి.. మరో నాలుగు రోజులు వర్షాలు ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. అయినా.. జీహెచ్ఎంసీ అలర్ట్ కాలేదు. వర్షాల వల్ల ఇబ్బందులు లేకుండా స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేయలేదు. తమ ఏరియాలో గుంతలను పూడ్చలేదని, మ్యాన్‌హోల్స్‌ను నిర్లక్ష్యంగా వదిలేశారని కలాసిగూడ ప్రజలు మండిపడ్డారు. తవ్విన గుంతను నిర్లక్ష్యంగా వదిలేయడంతోనే చిన్నారి మౌనిక జారిపడి ప్రాణాలు కోల్పోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.
తలసానిపై చిన్నారి కుటుంబసభ్యుల ఆగ్రహం
చిన్నారి మౌనిక కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ‘‘మీ వల్లే మా అమ్మాయి చనిపోయింది. మీ నిర్లక్ష్యం వల్లే మా పాప మాకు దూరమైంది” అంటూ తలసానిపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇద్దరు అధికారుల సస్పెండ్
కలాసిగూడలో బాలిక మృతి ఘటనలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఇద్దరు అధికారులపై వేటు వేశారు. సంఘటన స్థలంలో సరైన భద్రత చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని బేగంపేట అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ అధికారిగా ఈఈ ఇందిరాబాయిని నియమించారు. సమగ్ర నివేదికను పది రోజుల్లో అందజేయాలని ఆదేశించారు.
ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు
మౌనిక మృతిపై జీహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు హైకోర్టు అడ్వకేట్ రామారావు ఇమ్మానేని ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రాణాలు పోతున్నా పట్టింపేది?
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసిన సమయంలో ఎక్కడోచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్స్, తవ్వి వదిలేసిన గుంతలు, ఓపెన్ నాలాల వల్ల ప్రాణాలు పోతున్నాయి. 2020 సెప్టెంబర్ 17 నేరేడ్ మెట్లో నాలాలో కొట్టుకపోయి 12ఏండ్ల చిన్నారి సుమేధ మృతి చెందింది. 2021 సెప్టెంబర్ 24 - మణికొండలో డ్రైనేజీలో జారిపడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రజనీకాంత్, 2021 సెప్టెంబర్ 25 - కుత్బూల్లాపూర్ నాలాలో జారి పడి మోహన్ రెడ్డి, 2022 సెప్టెంబర్ 11 మూసాపేట్ నాలాలో జారిపడి రవి కూమార్ మృతి చెందారు. ఇవి కాకుండా ఓపెన్ నాలాల వల్ల కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు. వర్షం పడ్డ ప్రతిసారి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా జీహెచ్ఎంసీ పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నదని నగరవాసులు మండిపడుతున్నారు. సంఘటన జరిగిన సమయంలో అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారని అంటున్నారు.