పండుగ పూట విషాదం.. కరెంట్​ షాక్​తో ఇద్దరు మృతి.

పండుగ పూట  విషాదం.. కరెంట్​ షాక్​తో ఇద్దరు మృతి.

శంషాబాద్/ఇబ్రహీంపట్నం: భోగి పండుగనాడు సిటీలోని వేర్వేరు చోట్ల కరెంట్​షాక్​తో ఇద్దరు చనిపోయారు. కర్నాటకు చెందిన మీర్జా అసద్ డీసీఎం డ్రైవర్. సోమవారం తన డీసీఎం వెహికల్​లో ఇత్తడి వేస్టేజ్ లోడును తీసుకొని కాటేదాన్ ఇండస్ట్రియల్​ఏరియాకు వచ్చాడు. డీసీఎంను కంపెనీ బయట పార్క్​ చేస్తుండగా, పక్కనే ట్రాన్స్​ఫార్మర్​కు తాకింది. ఈ ప్రమాదంలో మీర్జా అసద్​అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాన్స్​ఫార్మర్ నుంచి మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆర్పివేశారు. 

ఆరుట్లలో రైతు..

అడవి పందులు రాకుండా ఏర్పాటు చేసిన కరెంట్​తీగలు తగిలి ఆరుట్లలో ఓ రైతు మృతి చెందాడు. మంచాల మండలం ఆరుట్లకు చెందిన పొలమోని సత్తయ్య(70) తన వ్యవసాయ భూమిలో కూరగాయలు పండిస్తున్నాడు. రాత్రి వేళల్లో అడవి పందులు రాకుండా కరెంట్​తీగలు అమర్చాడు. శనివారం రాత్రి 12 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లిన సత్తయ్య తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన పక్క పొలం రైతు.. కరెంట్ ​తీగల వద్ద సత్తయ్య పడిపోయి ఉండడాన్ని గమనించాడు. పరిశీలించగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు మంచాల సీఐ మధు తెలిపారు.