అఫ్గాన్ లో హత్య కేసు దోషులిద్దరికి బహిరంగ మరణశిక్ష

కాబూల్: అఫ్గానిస్తాన్ లో ఓ హత్య కేసులో దోషులుగా తేలిన ఇద్దరికి తాలిబాన్లు బహిరంగ మరణ శిక్ష విధించారు. గురువారం గజ్నీ సిటీలోని పుట్ బాల్ స్టేడియంలో దోషులను నిలబెట్టి, వెనక నుంచి తుపాకీతో కాల్చి చంపారు. తాలిబాన్ సుప్రీం లీడర్ హిబయతుల్లా అఖుంద్ జాదా వీరి డెత్ వారెంట్ పై సంతకం చేసిన తర్వాత ఈ శిక్షను అమలు చేశారు. ‘‘ఈ ఇద్దరు వ్యక్తులు హత్య నేరానికి పాల్పడ్డారు. ఈ కేసులో  రెండేండ్ల పాటు కోర్టు విచారణ జరిగింది. ఆ తర్వాత డెత్ వారెంట్ జారీ అయింది” అని ఓ అధికారి తెలిపారు. మరణదండనను చూసేందుకు స్టేడియంలో వేలాది పురుషులు గుమిగూడారు. దోషుల  కుటుంబ సభ్యుల సమక్షంలోనే శిక్షను అమలు చేశారు.  కాగా, తాలిబాన్లు 2021లో తిరిగి పవర్ లోకి వచ్చాక మరణ శిక్ష అమలు చేయడం ఇది నాలుగోసారి.