ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని డిస్ట్రిక్ట్ లైబ్రరీకి గురువారం చదువుకునేందుకు వచ్చిన దుర్గారావు(40) అనే వ్యక్తికి ఛాతి నొప్పి రావడంతో.. బయటకు వచ్చి ఈనో తాగి కింద పడిపోయాడు. అక్కడున్న వారు సీపీఆర్ చేసి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. 108 అంబులెన్స్ లో ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
దుర్గారావు నిరుద్యోగి కావడంతో ప్రతీ రోజు టీచర్ పోస్టులు, ఇతర నోటిఫికేషన్లు వచ్చాయా అని తెలుసుకునేవాడు. దుర్గారావు ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. ఆయన సొంతూరు విజయవాడ ఎన్ఎస్ సీ, బోస్ నగర్ కండ్రికా.
సౌదీలో మల్లాపూర్ వాసి..
బోయినిపల్లి, వెలుగు: బతుకుదెరువు కోసం గల్ఫ్వెళ్లిన ఓ వ్యక్తి గురువారం అక్కడే గుండెపోటుతో చనిపోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్లాపూర్‌కు చెందిన నడిగొట్టు రాజేశం(48) పదేండ్లుగా సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. రెండు నెలల కింద ఇంటికి వచ్చిన రాజేశం పీఎఫ్ డబ్బులు రావాల్సి ఉందని, అవి తీసుకొని వచ్చి మళ్లీ సౌదీకి వెళ్లనని ఇంట్లో చెప్పాడు.
నెలకింద సౌదీ వెళ్లాడు. గురువారం పనిలో ఉండగా గుండెపోటుతో చనిపోయినట్లు కంపెనీ వారు ఫోన్ చేసి చెప్పారు. మృతుడికి భార్య భారతి, కూతురు పూజిత, కొడుకు కౌశిక్ ఉన్నారు.