గేట్​ పడడంతో కింది నుంచి బైక్​ తీసుకువెళ్తుండగా రైలు ఢీకొని ఇద్దరు మృతి

కోల్​బెల్ట్, వెలుగు :  మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి రైల్వే గేట్​వద్ద బుధవారం జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. రామకృష్ణాపూర్​సూభాష్​నగర్​కు చెందిన ప్రైవేట్​ ఎలక్ట్రీషియన్​ భూక్యా సురేశ్​(30), పెయింటర్​కుంబాల చందు(40) రాత్రి 7.30 గంటలకు బైక్​పై మంచిర్యాల నుంచి రామకృష్ణాపూర్​ సుభాష్​నగర్​లోని ఇంటికి వెళ్తున్నారు. క్యాతనపల్లి రైల్వే గేట్ పడడంతో కొద్దిసేపు నిరీక్షించారు. 

రైలు రాక ఆలస్యమవుతుండడంతో బైక్​ను గేట్​కింది నుంచి తీసుకొని దాటుతుండగా బెల్లంపల్లి నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కేరళ ఎక్స్​ప్రెస్​ ఢీకొట్టింది. దీంతో వారు స్పాట్ లోనే  మృతి చెందారు. గేట్​వద్ద సురేశ్​బాడీ రెండు ముక్కలు కాగా చందు బాడీ రైలు ఇంజిన్​లో చిక్కుకొని సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాల రైల్వే స్టేషన్​వరకు వెళ్లింది. మంచిర్యాల రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

కాంగ్రెస్ నేతల ఆందోళన

సురేశ్, చందు ఇద్దరూ రైలు ఢీకొని చనిపోయారని తెలుసుకున్న క్యాతన్ పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాంగ్రెస్​ యువనేత, చెన్నూరు కాంగ్రెస్​ అభ్యర్థి వివేక్​వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ సైతం ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఈ సందర్భంగా కాంగ్రెస్​ లీడర్లు ఆందోళన చేశారు. 

2014లో అప్పటి పెద్దపల్లి ఎంపీ వివేక్​ వెంకటస్వామి రైల్వే ఓవర్ బ్రిడ్జికి రూ.32 కోట్లు శాంక్షన్ ​చేయించారన్నారు. తొమ్మిదేండ్లుగా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని, త్వరగా పూర్తి చేయాలని బీఆర్ఎస్​ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్​కు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. సుమన్​నిర్లక్ష్యం వల్లే రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయని, దీనికి ఎమ్మెల్యే బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు.  బాధిత కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని,  ఇద్దరి ఇండ్లల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్​ లీడర్లకు మధ్య వాగ్వాదం జరిగింది.