నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలో వీఆర్ఏ మృతి

సూర్యాపేట/డిచ్‌‌పల్లి, వెలుగు: గణేశ్‌‌ నిమజ్జనం చేస్తుండగా ఎస్సారెస్పీ కాల్వలో పడి ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌‌) మండలం కోటినాయక్‌‌ తండాలో జరిగింది. తండాకు చెందిన బానోతు సూర్య(55), బానోతు నాగు(40) శుక్రవారం రాత్రి స్థానిక వినాయక నిమజ్జనం కోసం ఎస్సారెస్పీ కాల్వ దగ్గరకు వెళ్లారు. నిమజ్జనం సమయంలో ప్రమాదవశాత్తు జారి కాల్వలో పడి గల్లంతయ్యారు. ఫైర్, పోలీస్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాల్వలో భారీగా కంపచెట్లు ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు.

చెరువులో మునిగి..

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలం ఘన్​పూర్​ లో నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వీఆర్ఏ బండి విజయ్(33) చెరువులో పడి మృతి చెందాడు. గురువారం రాత్రి నిమజ్జనంలో పాల్గొనేందుకు రాజరాజేశ్వర చెరువులో దిగిన విజయ్​ ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడు. రాత్రి ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం డెడ్​బాడీని గుర్తించారు. విజయ్​కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.