మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా మధిర రేంజ్‌లోని ఎర్రుపాలెం మండలం భీమవరం రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నంబర్ 64లోని అయ్యవారిగూడెంలో శుక్రవారం రాత్రి వేటగాళ్లు తుపాకీ, బుల్లెట్లతో వేటకు ప్రయత్నించారు. ఇద్దరు వేటగాళ్లను అటవీశాఖ అధికారులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అదుపులో తీసుకున్నట్లు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు.
శనివారం మధిరలోని ఫారెస్ట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేశ్ భీమవరం సంఘటనా స్థలానికి చేరుకుని అడవి జంతువుల వేటలో ఉన్న వేటగాళ్లను గుర్తించారు. కొందరు పారిపోగా ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి నుంచి తుపాకీ, రెండు ద్విచక్ర వాహనాలును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మధిర కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.