గజ్వేల్​లో బైకును ఢీకొట్టిన వెహికల్.. ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి

  • మారథాన్​లో పాల్గొనేందుకు వెళ్తుండగా గజ్వేల్​లో ప్రమాదం
  • కామారెడ్డి జిల్లాలో లారీని ఢీకొట్టిన కారు.. తల్లీ, కొడుకు మరణం

గజ్వేల్/భిక్కనూరు, వెలుగు: మారథాన్ లో పాల్గొనేందుకు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం బైకును ఢీ కొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ​పట్టణం పాండవుల చెరువు సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన వర్కల్ పరంధాములు(46) రాయపోల్ పోలీస్ స్టేషన్​లో, సిద్దిపేట పట్టణం గాడిచెర్ల పల్లికి చెందిన పూసల వెంకటేశ్(38) దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్స్ గా పనిచేస్తున్నారు.

వీరిద్దరూ గతంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆఫీస్​లో విధులు నిర్వహించారు. అప్పటినుంచి ఇద్దరూ కలిసి మారథాన్ రన్ లలో పాల్గొంటున్నారు. ఆదివారం కూడా హైదరాబాద్ ఈసీఐల్​లో జరిగే మారథాన్ రన్​లో పాల్గొనేందుకు ఇద్దరూ దౌల్తాబాద్ నుంచి బైక్​పై బయలుదేరారు.

వీరు ప్రయాణిస్తున్న బైకును పాండవుల చెరువు సమీపంలో గుర్తుతెలియని వాహనం అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలై స్పాట్ లోనే చనిపోయారు. పోలీసులు మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సిద్దిపేట సీపీ అనురాధ, పోలీస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్​రెడ్డి, గజ్వేల్ ఇంచార్జీ ఏసీపీ మధు హాస్పిటల్ లో మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల నిమిత్తం బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 60 వేల ఆర్థిక సాయం అందజేశారు. యాక్సిడెంట్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. కామారెడ్డిలో తల్లీకొడుకు మృతి
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి సమీపంలో హైవేపై ఆదివారం జరిగిన యాక్సిడెంట్ లో తల్లీ, కొడుకు చనిపోయారు. జిల్లాలోని బాన్సువాడకు చెందిన అక్షయ్​రెడ్డి హైదారాబాద్​లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. అతనితో పాటు కుటుంబ సభ్యులు కూడా హైదరబాద్​లో ఉంటున్నారు. ఆదివారం బాన్సువాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్షయ్​రెడ్డితో పాటు, అతని తల్లి కుర్ల లక్ష్మి, బంధువులు రాజేశ్వర్​రెడ్డి, భూమవ్వ కారులో  బయలుదేరారు.

మార్గ మధ్యంలో భిక్కనూరు మండల కేంద్రానికి సమీపంలోకి రాగానే హైవేపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. కారు నడుపుతున్న అక్షయ్​రెడ్డి(25) అక్కడికక్కడే చనిపోగా తీవ్రగాయాలైన మిగతా ముగ్గురిని కామారెడ్డి జిల్లా హాస్పిటల్​కు, అక్కడి నుంచి హైదరాబాద్​కు తరలించారు. కుర్ల లక్ష్మీ(48) హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో చికిత్స పొందుతూ చనిపోయింది. రాజేశ్వర్​రెడ్డి, భూమవ్వ చికిత్స పొందుతున్నారు. మృతురాలి భర్త నరసింహారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.