జైలులో రామాయణ నాటకం.. సీతను వెతకడానికి వెళ్లి ఖైదీలు పరార్

జైలులో రామాయణ నాటకం.. సీతను వెతకడానికి వెళ్లి ఖైదీలు పరార్

హరిద్వార్‌లోని రోషనాబాద్‌ జైలులో వార్షిక రామ్‌లీలా ప్రదర్శనలో పాల్గొన్న ఇద్దరు ఖైదీలు శుక్రవారం జైలు నుంచి పరారయ్యారు. వీరిద్దరూ నాటకంలో 'వానరం' (కోతి) పాత్రలు పోషించారు. నాటకంలో భాగంగా వీరిద్దరూ సీతను వెతకడానికి వెళ్లి తిరిగి రాలేదు. 

అసలేం జరిగిందంటే..?

పారిపోయిన ఇద్దరు ఖైదీలు పంకజ్, రాజ్‌కుమార్ రామ్‌లీలా నాటకంలో వానర సేన సభ్యులు. రావణుడు.. సీతను అపహరించుకుపోయిన సన్నివేశం ముగిసిన తరువాత వానర సభ్యులు రామ పత్ని కోసం వెతకడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఖైదీలు పంకజ్, రాజ్‌కుమార్ ఇద్దరూ జైలు గోడపై శోధించడం మొదలు పెట్టారు. అది నాటకంలో భాగమని ప్రేక్షకులు, పోలీసులు నోరెళ్ళబెట్టి చూస్తుండగా.. వారివురూ గోడ దూకి పారిపోయారు. చివరకు సీత దొరికినప్పటికీ.. వారిద్దరూ మాత్రం తిరిగి రాలేదు.

పంకజ్, రాజ్‌కుమార్ ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఏదో తప్పు జరిగిందని అనుమానించిన అధికారులు.. వారి కోసం జైలులో గాలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రూర్కీకి చెందిన పంకజ్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగా, ఉత్తరప్రదేశ్‌లోని గోండాకు చెందిన రాజ్‌కుమార్ కిడ్నాప్ కేసులో విచారణలో ఉన్నాడు. వీరి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో భద్రతా లోపాలపైనా అధికారులు విచారణ జరుపుతున్నారు.

ALSO READ : ప్రాక్టీస్ లో మిస్ ఫైర్.. ఇద్దరు అగ్నివీర్ ‌‌లు మృతి