జేఎన్టీయూ ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్లకు అన్యాయం జరుగుతోంది : ప్రొఫెసర్లు

జేఎన్టీయూ ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్లకు అన్యాయం జరుగుతోంది : ప్రొఫెసర్లు

హైదరాబాద్ : జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్ టీయూ)లో ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్లకు అన్యాయం జరుగుతోందంటూ ఇద్దరు ప్రొఫెసర్లు వసుమతి, సుమతి ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో సీనియర్లకు కాకుండా జూనియర్లకే పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. తమకు 20 సంవత్సరాలకుపైగా అనుభవం ఉన్నా పదవులు ఇవ్వడం లేదని వాపోయారు. తమ సమస్యల గురించి రిజిస్టర్ మంజూర్ హుస్సేన్ కు వినతి పత్రం ఇచ్చినా.. ఆయన కూడా స్పందించడం లేదన్నారు. యూజీసీ కమిషన్ ప్రకారం ఒక వ్యక్తికి ఒక పోస్ట్ మాత్రమే కేటాయించాలనే ఆదేశాలు ఉన్నా.. జేఎన్టీయూ యూనివర్సిటీలో మాత్రం నిబంధనలు పాటించడం లేదన్నారు. ఒక వ్యక్తికి రెండు పోస్టులు కట్టబెడుతున్నారని వాపోయారు. 

తమకు సీనియారిటీ ప్రకారం అందాల్సిన పోస్టులు తమకు అందించకుండా తమకంటే తక్కువ కాలం నుండి పని చేస్తున్న వారికి ఉన్నత పదవులను కట్టబెడుతున్నారని ప్రొఫెసర్లు వసుమతి, సుమత ఆరోపించారు. ఇదేంటని అడిగితే తమను ట్రాన్స్ ఫర్ చేస్తామని భయాందోళనలకు గురి చేస్తున్నారని వాపోయారు. యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లకు వీసీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని, యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తులకు మాత్రం గంటలకొద్దీ అపాయింట్ మెంట్లు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. జేఎన్టీయూ యూనివర్సిటీలో అందరికీ సమన్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వైస్ చాన్సులర్లు స్పందించి సీనియారిటీ ప్రకారం పోస్టులు కేటాయించాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని స్పష్టం చేశారు.