హనుమకొండ, వెలుగు : నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను హనుమకొండ, సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు ఫోన్లు, మావోయిస్టుల పేరుతో ఉన్న లెటర్‌ప్యాడ్, బైక్స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి మంగళవారం వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపాడు గొల్లపల్లికి చెందిన దాసరి శ్రీకాంత్, వరంగల్ కరీమాబాద్ కు చెందిన బాలిన మహేశ్ అనే స్నేహితులు ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలని ప్లాన్‌చేసి సీపీఐ మావోయిస్టు పార్టీ పేర బెదిరించడం మొదలు పెట్టారు. చర్ల,-శబరి ఏరియా కమిటీ కమాండర్ దేవన్నపేరిట లెటర్ ప్యాడ్ తయారు చేసి.. ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ సమీపంలోని ఎన్ఎస్ఆర్ గ్రూప్సంస్థలు, వరంగల్ లోని అజారా హాస్పిటల్, దీపక్ స్కిన్ క్లినిక్‌లకు నాలుగు రోజుల కింద లెటర్ పంపించారు.
పాలను ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్టు ఎన్ఎస్ ఆర్ డెయిరీ వారిని , రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ హాస్పటల్ వారిని బెదిరించారు. ఎన్ఎస్ఆర్ సంస్థల ఆస్తుల వివరాలు, హాస్పిటల్లైసెన్స్ తో పాటు డబ్బులు తెచ్చి ఇవ్వాలని, ఈ విషయాన్ని పోలీసులకు చెబితే ఈడీ, సీబీఐకి పట్టిస్తామని, డబ్బులు ఇవ్వకపోతే నక్సలైట్ల చేతితో చస్తారంటూ ఫోన్ చేసి బెదిరించారు. అనుమానం వచ్చిన ఎన్ఎస్ఆర్గ్రూప్యజమానులు ఆత్మకూరులో, అజారా, దీపక్స్కిన్ క్లీనిక్ ఓనర్లు హనుమకొండ పీఎస్‌లో ఫిర్యాదు చేశాయి. నిందితుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ములుగురోడ్డు హనుమాన్ జంక్షన్‌వద్ద శ్రీకాంత్‌ను పట్టుకున్నారు. అతని సమాచారం మేరకు వరంగల్ లోఉన్న మహేశ్ ను అరెస్ట్ చేశారు. ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏసీపీ సూచించారు.