- ఆభరణాలు, విలువైన వస్తువులు పోవడంతో విలపించిన బాధితుడు
- పోలీసులకు ఫిర్యాదు చేయగా బట్టబయలైన దొంగ స్నేహితుల బాగోతం
హైదరాబాద్: స్నేహితుడి ఇంటికే కన్నం వేసిన ఉదంతం ఇది. బాధితుడు, నిందితులు ముగ్గురు రైల్వే ఉద్యోగులే కావడం గమనార్హం. విలువైన ఆభరణాలు, వస్తువులను ఎత్తుకెళ్లడంతో నిర్ఘాంతపోయిన రైల్వే ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దొంగలెవరో తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ వ్యవహారం.. బయటపడ్డ దొంగల ఉందంతం కలకలం రేపుతోంది. వివరాలిలా ఉన్నాయి.
మల్కాజిగిరి పోలిస్స్టేషన్ పరిధిలోని లాలాపేట్, ఇందిరా నగర్లో నివసించె బంగారి పవన్ కుమార్ (24), సికింద్రాబాద్ ఆర్ఆర్ కాలనీలో నివసించె సను సింగ్ కాడ్లె ఛత్రి (24), మల్కాజిగిరి యాదవ నగర్లో నివసించె నవీన్ కుమార్ అనే ముగ్గురు రైల్వే ఉద్యోగులు. పవన్ కుమార్, కాడ్లె ఛత్రి ఇద్దరూ కలసి తరచుగా నవీన్ ఇంటికి వచ్చి వెళ్లేవారు. ముగ్గురు కలసి విందులు, వినోదాలతో గడిపేవారు. నవీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లి బుధవారం తిరిగి వచ్చారు.
ఇంటికి రాగానే మెయిన్ డోర్ తీసిఉండడం.. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడం గమనించారు. ఇంట్లో చోరి జరిగిందని అర్థం కావడంతో వెంటనే మల్కాజిగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నవీన్ అక్క రాచకొండ జ్యోస్న పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు శనివారం యాదవ నగర్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించారు. ఫుటేజ్ ఆధారంగా చోరీ చేసింది నవీన్ స్నేహితులైన పవన్ కుమార్, సను సింగ్ కాడ్లె ఛత్రిగా గుర్తించి, వారి ఇంట్లో అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 37.5 గ్రాముల బంగారు నగలను సీజ్ చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించామని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.