
- కరెంట్ పోల్‌ను కారు ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్థి మృతి
- మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
- అందరూ ఎంజీఐటీ విద్యార్థులే
గండిపేట, వెలుగు: ఓవర్ స్పీడ్‌తో కారు అదుపుతప్పి కరెంట్‌పోల్‌ను ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గండిపేటలోని ఎంజీఐటీ కాలేజీలో శ్రీకార్, హేమసాయి, వివేక్, సృజన్, కార్తికేయ, హర్ష బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. వీరు ఆరుగురు మంగళవారం స్విఫ్ట్‌కారులో కాలేజీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. మార్గమధ్యలో రాజపుష్ప కన్స్ట్రక్షన్స్లోని ప్లాట్ 01 సమీపంలో నియో పోలీస్ రోడ్డు వద్ద కరెంట్‌పోల్‌ను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు నడిపిస్తున్న శ్రీకార్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లారీ చక్రాల కిందపడి మరొకరు..
గండిపేట: ఆరాంఘర్ చౌరస్తా ప్రాంతంలో ఓ లారీ రివర్స్ తీస్తుండగా, చక్రాల కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు.
చాయ్ తాగడానికి వెళ్తూ వృద్ధుడు..
శామీర్ పేట: చాయ్ తాగడానికి వెళ్లిన వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శామీర్ పేట మండలం తుర్కపల్లికి చెందిన బుస బాలయ్య (60) మంగళవారం చాయ్ తాగేందుకు రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న బైక్ అతడిని ఢీకొనంతో మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన యువకుడికి సైతం గాయాలు కాగా, సమీప ఆసుపత్రికి తరలించారు.