నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి..ఆదిలాబాద్​ జిల్లా మావలలో ఘటన

నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి..ఆదిలాబాద్​ జిల్లా మావలలో ఘటన

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా మావలలోని హైవేకు ఆనుకొని ఉన్న ఎర్రకుంట చెరువులో పడి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. మావల మండలం 170 సర్వే నంబర్​లో గుడిసెలు వేసుకొని ఉంటున్న దుర్గాప్రసాద్, సత్యభామ దంపతుల కొడుకు కాంబ్డే రాహుల్ (9), గుడిహత్నూర్ కు చెందిన రాజ్ కుమార్  కొడుకు చిప్పకుర్తి సంజీవ్(10) నానమ్మ తారాబాయితో కలిసి ఆదిలాబాద్ లో ఉంటున్నారు.

మావలలోని ప్రైమరీ స్కూల్​లో రాహుల్  నాల్గవ తరగతి, సంజీవ్  ఐదో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూల్​కు సెలవు ఉండడంతో రాహుల్  తమ్ముడు విశాల్ తో కలిసి వీరిద్దరు ఎర్రకుంట చెరువుకు ఈతకు వెళ్లారు. అక్కడ స్నానం చేస్తుండగా, రాహుల్‌‌, సంజీవ్‌‌ కుంటలో పడిపోయారు. వారి వెంట ఉన్న విశాల్ ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలించి ఇద్దరి డెడ్​బాడీలు బయటకు తెచ్చారు.

రెండు రోజుల్లో పుట్టిన రోజు..

నానమ్మ తారాబాయి వద్ద ఉంటూ సంజీవ్‌‌ చదువుకుంటున్నాడు. మరో రెండు రోజుల్లో సంజీవ్ పుట్టిన రోజు ఉందని, బట్టలు కొనిద్దామని పింఛన్  డబ్బులు దాచి పెట్టానంటూ నానమ్మ రోదించడం కలచివేసింది. పొట్ట కూటీ కోసం వలస వచ్చిన ఏపీ రాష్ట్రం వైజాగ్‌‌కు చెందిన దుర్గాప్రసాద్, సత్యభామ దంపతులు ఇద్దరు కుమారులతో కలిసి ఐదేండ్లుగా ఆదిలాబాద్ లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. వీరి కొడుకు చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. 

గల్లంతైన ఇద్దరు యువకుల డెడ్​బాడీలు లభ్యం..

సంగారెడ్డి (హత్నూర): సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల గ్రామ శివారులోని భీముని చెరువులో శుక్రవారం ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల డెడ్​బాడీలు శనివారం దొరికినట్లు ఎస్సై సుభాష్  తెలిపారు. కొండాపూర్  మండలం వీరభద్రపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్(32) కుటుంబసభ్యులతో బోర్పట్లలో జరుగుతున్న మల్లన్న జాతర ఉత్సవాలకు వచ్చాడు. గ్రామానికి చెందిన బంధువు డప్పు నవీన్(26)తో కలిసి భీముని చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ప్రేమ్ కుమార్ కు భార్య పిల్లలు ఉండగా, నవీన్ కు భార్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు.