
- ఆధితపత్యం కోసం ఆ ఇద్దరు నేతల యత్నం
- వేర్వేరుగా సురేశ్షెట్కార్, సంజీవరెడ్డి కార్యక్రమాలు
సంగారెడ్డి, వెలుగు : నారాయణఖేడ్ కాంగ్రెస్లో ఇద్దరు సీనియర్ నేతలు ఆధిపత్యం కోసం గొడవపడుతుండడం కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తోంది. నియోజకవర్గంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ పట్లోళ్ల సంజీవరెడ్డి మధ్య కొన్నేళ్లుగా రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. దీనిని బీఆర్ఎస్ క్యాచ్ చేసుకొని ఖేడ్ లో ఆరున్నరేళ్లుగా గులాబీ జెండా ఎగురవేస్తూ వస్తోంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా నిలిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో సురేశ్ షెట్కార్, సంజీవరెడ్డి వేర్వేరుగా పోటీ చేయడం, కార్యకర్తలు కూడా రెండు వర్గాలుగా చిలిపోవడం పార్టీకి నష్టం కలిగించింది.
ఇద్దరూ కలిస్తేనే మేలు..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలతోపాటు పార్టీ ప్రోగ్రామ్లను ఆ ఇద్దరు వేర్వేరుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఎవరైనా ముఖ్య నేతలు వచ్చినప్పుడు ఒకే సభలో పాల్గొనాల్సి వస్తే ఎడ మొహం పెడ మొహంగా ఉంటున్నారు. సురేశ్షెట్కార్, సంజీవరెడ్డికి వ్యక్తిగతంగా, కమ్యూనిటీ పరంగా మద్దతుదారులు ఉండడంతో ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని చూయించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎటు పోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. కలిసి పని చేస్తే గెలిచే అవకాశం ఉన్నా ఇద్దరి తీరు మారకపోవడంతో కొందరు కార్యకర్తలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఖేడ్ లో సంజీవరెడ్డికి వ్యక్తిగత ఇమేజ్ తోపాటు తండ్రి కిష్టారెడ్డి హయం నుంచి పనిచేసిన కార్యకర్తల సపోర్ట్ ఉంది. సురేశ్ షెట్కర్ కు లింగాయత్ సామాజికవర్గం అండదండలు ఉన్నాయి. అయితే ఇప్పటికైనా వీళ్లు ఇద్దరు కలిసి పని చేస్తే ఖేడ్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. వైఎస్హయాంలో మాదిరిగా ఒకరు ఎంపీకి, మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రెండు స్థానాల్లో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకొని ఆ ఇద్దరు నేతలతో చర్చలు జరిపి వారి మధ్య రాజీ కుదుర్చాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.