- నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో దారుణం
వర్ని, వెలుగు : మద్యం మానేసి, కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పిన తండ్రిని ఓ కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం(ఆర్)లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబం(ఆర్) గ్రామానికి చెందిన షేక్ హైమద్ (65)కు ఇద్దరు భార్యలు కాగా, అనారోగ్యంతో వారిద్దరూ చనిపోయారు. మొదటి భార్య కొడుకు జమీల్ వేరుగా ఉంటుండగా, రెండో భార్య కుమారుడు మహబూబ్ తండ్రితో కలిసి ఉంటున్నాడు.
మహబూబ్ మద్యానికి బానిసగా మారి జులాయిగా తిరుగుతుండడంతో ఏడాది కింద అతడి భార్య వదిలేసి వెళ్లిపోయింది. దీంతో మద్యం మానేసి, ఏదైనా పని చేసుకుంటూ భార్యాబిడ్డలను పోషించుకోవాలని హైమద్ కొడుకు మహబూబ్‌కు సూచించాడు. ఈ విషయంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన మహబూబ్ తండ్రి హైమద్‌ను కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి మొదటి భార్య కుమారుడు జమీల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో...
గోదావరిఖని, వెలుగు : మద్యం మత్తు, కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తండ్రిని చంపేశాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో సోమవారం జరిగింది. మండలంలోని రామారావుపల్లి గ్రామానికి చెందిన సందవేణి రమేశ్ మద్యానికి బానిసై, ఎలాంటి పని చేయకుండా తిరిగేవాడు. ఈ క్రమంలో రమేశ్ సోమవారం సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి వచ్చి పడుకున్న తండ్రి శంకరయ్య (60)పై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య గట్టమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, బసంత్‌నగర్ ఎస్సై స్వామి తెలిపారు.