హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌లో తెలంగాణ అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. యంగ్ షూటర్ ఇషా సింగ్ అద్భుతమైన గురితో మరో రెండు మెడల్స్ కొల్లగొడితే, బాక్సింగ్ క్వీన్ నిఖత్ జరీన్ తన పంచ్ పవర్‌ను చూపెట్టింది. మెడల్‌తో పాటు పారిస్ ఒలింపిక్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన విమెన్స్ ఇండివిడ్యువల్10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఇషా 239.7 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచి సిల్వర్‌ను గెలుచుకుంది. ఇండియాకే చెందిన పాలక్ గులియా 242.1 పాయింట్లతో గేమ్స్ రికార్డును నెలకొల్పి గోల్డ్ మెడల్‌తో మెరిసింది.
ఇషా, పాలక్ మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్లో మొదట తెలంగాణ షూటర్ ఆధిక్యంలో కొనసాగినా తర్వాత పాలక్ అద్భుతమైన గురితో ఆకట్టుకుంది. ఇక టీమ్ విభాగంలో ఇషా (579)–పాలక్ (577)– దివ్య టీఎస్ (575) త్రయం 1731 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచి రజతాన్ని సొంతం చేసుకుంది. చైనా (1736), చైనీస్‌తైపీ (1723) వరుసగా గోల్డ్, బ్రాంజ్‌ను సాధించాయి. తాజా పెర్ఫామెన్స్‌తో ఆసియా గేమ్స్‌లో నాలుగు పతకాలు సాధించిన తొలి మహిళగా ఇషా సింగ్ సరికొత్త రికార్డును సృష్టించింది. బుధవారం జరిగిన విమెన్స్ 25 మీటర్ల పిస్టల్ ఇండివిడ్యువల్‌లో సిల్వర్, టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా గేమ్స్‌లో ఇప్పటి వరకు ఇండియా 8 గోల్డ్, 12 సిల్వర్, 13 బ్రాంజ్‌లతో కలిపి 33 మెడల్స్‌ను సాధించి నాలుగో ప్లేస్‌లో కొనసాగుతున్నది.
నిఖత్‌కు పతకం ఖాయం
గేమ్స్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఒకే పంచ్‌తో రెండు విజయాలు సాధించింది. శుక్రవారం జరిగిన విమెన్స్ 50 కేజీల క్వార్టర్‌ఫైనల్లో నిఖత్ ఆర్‌ఎస్‌సీ (రిఫరీ స్టాప్స్ కంటెస్ట్) ద్వారా నాసెర్ హనన్ (జోర్డాన్)పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. దాంతో కనీసం కాంస్యాన్ని ఖాయం చేసుకోవడంతో పాటు పారిస్ ఒలింపిక్ బెర్త్‌ను దక్కించుకుంది. షార్ప్ పంచ్‌లతో బౌట్ మొదలుపెట్టిన నిఖత్ కచ్చితమైన కాంబినేషన్ పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో రిఫరీ మధ్యలోనే బౌట్ ఆపేసి నిఖత్‌ను విన్నర్‌గా ప్రకటించాడు. విమెన్స్ బాక్సింగ్ 50, 54, 57, 60 కేజీల విభాగంలో సెమీస్ చేరిన బాక్సర్లు డైరెక్ట్‌గా ఒలింపిక్స్‌కు క్వాలిఫై అవుతారు.
50 మీటర్ల రైఫిల్‌లో గోల్డ్
50 మీటర్ల రైఫిల్‌లో గోల్డ్‌మెన్స్ 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో ఇండియా షూటర్ల గురి మళ్లీ అదిరింది. మెన్స్ 3 పొజిషన్ టీమ్ ఫైనల్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తొమర్–స్వప్నిల్ కుశాలె–అఖిల్ షిరోన్ 1769 పాయింట్లతో టాప్ ప్లేస్‌తో గోల్డ్ మెడల్‌ను గెలిచారు. హోరాహోరీ ఫైనల్లో ఐశ్వరీ ప్రతాప్ 591, స్వప్నిల్ 591, షిరోన్ 587 పాయింట్లతో వరల్డ్ రికార్డు (1769) స్కోరును నమోదు చేశారు. చైనా 1763 పాయింట్లతో సిల్వర్, సౌత్ కొరియా 1748 పాయింట్లతో బ్రాంజ్ మెడల్‌ను సాధించాయి. ఇండివిడ్యువల్ ఫైనల్లోనూ ఐశ్వరీ ప్రతాప్ తృటిలో గోల్డ్ మెడల్‌ను మిస్సయ్యాడు. ఎలిమినేషన్ రౌండ్‌లో 9.7 పాయింట్లే సాధించాడు. దీంతో ఓవరాల్‌గా 459.7 పాయింట్లతో సిల్వర్‌ను కైవసం చేసుకున్నాడు. ఇండియాకే చెందిన స్వప్నిల్ 438.9 పాయింట్లతో నాలుగో ప్లేస్‌కు పరిమితమయ్యాడు. చైనాకు చెందిన డు లిన్షూ (460.6) గేమ్స్ రికార్డుతో గోల్డ్‌ను గెలవగా, టియాన్ జియామింగ్ (448.3) బ్రాంజ్‌ను దక్కించుకున్నాడు.
టెన్నిస్‌లో సిల్వర్ మెరుపులు
మెన్స్ డబుల్స్‌లో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ సిల్వర్‌తో మెరిశారు. శుక్రవారం జరిగిన గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో సాకేత్–రామ్‌కుమార్ 4–6, 4–6తో చైనీస్‌తైపీ జోడీ హుసు యు హిసోయ్–జాసన్ జుంగ్ చేతిలో ఓడి రెండో ప్లేస్‌తో సరిపెట్టుకున్నారు. సాకేత్‌కు ఇది మూడో ఆసియా గేమ్ మెడల్. మిక్స్‌డ్ కేటగిరీలో వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న–రుతుజా భోంస్లే జోడీ గోల్డ్ మెడల్‌కు అడుగు దూరంలో నిలిచింది. సెమీస్‌లో బోపన్న–రుతుజా 6–1, 3–6, 10–4తో చాన్ హో చింగ్–యు హిసోయ్ హుసు (చైనీస్‌తైపీ)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు.
స్క్వాష్, షాట్‌పుట్‌లో బ్రాంజ్
ఇండియా స్క్వాష్ విమెన్స్ టీమ్ బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకుంది. జోష్న చినప్ప–అన్హాత్ సింగ్–తన్వి ఖన్నాతో కూడిన ఇండియన్ త్రయం సెమీస్‌లో 1–2తో హాంకాంగ్ చేతిలో ఓడింది. జోష్న 3–2తో జి లోక్ హోపై గెలవగా, తన్వీ 0–3తో సిన్ యుక్ చెన్ చేతిలో అన్హాత్ 0–3తో లీ కా యి చేతిలో ఓడారు. అథ్లెటిక్స్‌లో ఇండియా ఖాతా తెరిచింది. విమెన్స్ షాట్‌పుట్‌లో కిరణ్ బలియాన్ మూడో ప్రయత్నంలో ఇనుప గుండును 17.36 మీటర్ల దూరం విసిరి బ్రాంజ్ మెడల్‌ను సాధించింది. దీంతో 72 ఏళ్ల తర్వాత గేమ్స్‌లో మెడల్ గెలిచిన తొలి ఇండియన్ విమెన్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. 1951 న్యూఢిల్లీలో ఆంగ్లో ఇండియన్ బార్బారా వెబ్‌స్టెర్ తొలిసారి కాంస్యాన్ని సొంతం చేసుకుంది.