నెల కింద చెల్లి.. వారం కింద అక్క!

నెల కింద చెల్లి.. వారం కింద అక్క!
  • ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి
  • సంగారెడ్డి జిల్లా సంగాపూర్ లో విషాదం 

రాయికోడ్, వెలుగు : వారం కింద ఇంట్లోంచి వెళ్లిన బాలిక బావిలో శవమై కనిపించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.  గ్రామ‌స్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. రాయికోడ్ మండ‌లం సంగాపూర్ గ్రామానికి చెందిన మదుగ‌డ్డ సతీశ్, అదే గ్రామానికి చెందిన ఎరుక‌లి అనితను ప్రేమించి పన్నెండేండ్ల కింద కులాంతర పెండ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు వైష్ణవి(11), హ‌రిత (6) ఉన్నారు. దంపతులు గొడ‌వ ప‌డుతుండేవారు. గత న‌వంబ‌ర్ లో  మరోసారి గొడవపడగా అనిత ఇంట్లోంచి వెళ్లిపోయింది.  పిల్లలు తండ్రి, నాన‌మ్మ స‌మ్మమ్మ వద్దే ఉంటున్నారు. 

2024 డిసెంబర్ లో చిన్న కూతురు హ‌రిత మృతి చెందింది.  పెద్ద  కుమార్తె వైష్ణవి ఈనెల 9న తల్లి వద్దకు వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లోంచి ఎటో వెళ్లింది. గురువారం గ్రామానికి సమీపంలోని వ్యవ‌సాయ బావి వద్ద అదే గ్రామానికి చెందిన ఉప్పరి శ్రీ‌కాంత్ కు బాలిక‌ దుస్తులు, చెప్పులతో పాటు ఫ్యామిలీ గ్రూప్ ఫొటో  క‌నిపించాయి.  వెంటనే కుటుంబ స‌భ్యుల‌కు చెప్పాడు. దీంతో బావి వ‌ద్దకు వెళ్లి చూడగా వైష్ణవి డెడ్ బాడీ కనిపించింది. పోలీసుల‌కు తెలపగా ఘ‌ట‌న స్థలానికి వెళ్లి డెడ్​బాడీని బయటకు తీశారు. మృతురాలి నాన‌మ్మ ఫిర్యాదుతో మిస్సింగ్ కేసుగా న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్లు రాయికోడ్ ఎస్ఐ నారాయ‌ణ తెలిపారు. 

 క‌న్న తండ్రి పనేనా..?

 భార్య వెళ్లిపోయింద‌నే బాధతోనా..?  లేక కోపంతోనో ఇద్దరి కూతుళ్ల చావుకు క‌న్నతండ్రే కార‌ణమనే అనుమానాలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. నెల రోజుల కింద చిన్న కుమార్తె చనిపోగా..  ఆమె మృతికి గ‌ల కార‌ణాలను బ‌య‌టకి చెప్పలేదనే ఆరోపణలు ఉన్నాయి. వారం కింద పెద్ద కుమార్తె ఇంట్లోంచి వెళ్లినట్లు చెబుతున్నా..  బావిలో శవమై కనిపించడంతో అనుమానాలు మరింగా బలపడుతున్నాయి.