అతివేగానికి ఇద్దరు సాఫ్ట్​వేర్ ఇంజినీర్లు బలి..

  • డివైడర్​ను బైక్ ఢీకొని మృతి
  • గచ్చిబౌలిలో ఘటన

గచ్చిబౌలి, వెలుగు: అతివేగం కారణంగా ఇద్దరు సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని కాకినాడకు చెందిన కేసాని వెంకన్నస్వామి (30) హైదరాబాద్​లోని అమెజాన్​లో సాఫ్ట్​వేర్  ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అలాగే, వైజాగ్ కు చెందిన కుమార్​స్వామి (25) కూడా మైక్రోసాఫ్ట్​లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ నానక్ రాంగూడలోని వర్కింగ్  హాస్టల్లో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులకు ఇద్దరూ ఫ్రెండ్స్​ అయ్యారు.

గురువారం రాత్రి ఇద్దరూ సెకండ్  షో సినిమాకు వెళ్లారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో సినిమా వదిలిపెట్టిన తరువాత గచ్చిబౌలి నుంచి బైక్  మీద తమ హాస్టల్​కు బయలుదేరారు. ఓవర్​స్పీడ్​తో డ్రైవ్​ చేయడంతో వారి బైక్​ గచ్చిబౌలి ఐఐఐటీ చౌరస్తా వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ బైక్  మీద నుంచి ఎగిరి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను కొండాపూర్  జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.