దారుణం: ఈ ఇద్దరు ఐటీ ఉద్యోగులను చెత్త బండి చంపేసింది..

దారుణం: ఈ ఇద్దరు ఐటీ ఉద్యోగులను చెత్త బండి చంపేసింది..

బెంగళూరులో విషాద ఘటన జరిగింది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు హార్లీడేవిడ్సన్ బైక్పై వెళుతుండగా బెంగళూరు నగర మున్సిపాలిటీ చెత్త ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళుతున్న ప్రశాంత్ (25), శిల్ప (27) తీవ్ర గాయాల పాలై ప్రాణాలు కోల్పోయారు. ప్రశాంత్ స్వస్థలం బెంగళూరులోని బనస్వాడి కాగా, శిల్ప స్వస్థలం ఏపీలోని హిందూపురం కావడం గమనార్హం. ఈ ఇద్దరూ టీసీఎస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. శిల్ప వైట్ఫీల్డ్లోని ఒక పీజీ హాస్టల్లో ఉండేది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. 

బెంగళూరు మేజిస్టిక్ బస్టాండ్ నుంచి కేఆర్ సర్కిల్ వైపు ప్రశాంత్, శిల్ప బైక్పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్పై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన బీబీఎంపీ చెత్త బండి వీరి బైక్ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో ప్రశాంత్, శిల్ప స్పాట్లోనే చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరూ హెల్మెట్ ధరించే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన మున్సిపాలిటీ ట్రక్కు డ్రైవర్ ఘటన జరగిన తర్వాత భయంతో పారిపోయాడు. పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఆ బీబీఎంపీ చెత్త బండి డ్రైవర్ను శివశంకర్గా పోలీసులు గుర్తించారు. తాగి చెత్త బండి నడిపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులోనే ట్రక్కు వేగంగా నడిపి ప్రమాదానికి కారణమై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై కర్నాటక హోం మంత్రి జీ పరమేశ్వర, బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) స్పందించింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ బాధితుల కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ ప్రమాదం గురించి తెలిసిన బెంగళూరు నగర యువత మాత్రం చెత్త బండి డ్రైవర్ల ర్యాష్ డ్రైవింగ్పై మండిపడుతున్నారు. బెంగళూరు నగరంలో చెత్త ట్రక్కు డ్రైవర్లలో కొందరు ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని గత రెండేళ్లలో జరిగిన ఘటనలు గుర్తుచేసుకుంటున్నారు. 

ఏప్రిల్ 2023లో జయనగర్ మెట్రో స్టేషన్ సమీపంలో జయలింగ అనే వ్యక్తిని చెత్త ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. 2022 మేలో అతి వేగంగా వచ్చిన బీబీఎంపీ చెత్త ట్రక్కు ఢీ కొట్టడంతో దేవన్న అనే ఫుడ్ డెలివరీ బాయ్ చనిపోయాడు. ఈ ఘటనల తర్వాత చెత్త ట్రక్కులపై బీబీఎంపీ ఐడెంటిఫికేషన్ను తొలగించి బెంగళూరు నగరపాలక సంస్థ విమర్శల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. బెంగళూరు నగరవాసుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో చెత్త ట్రక్కులకు గంటకు 35 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ను నిర్దేశించారు.