ఆసియా కప్‌కు కరోనా ముప్పు.. ఇద్దరు ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్

ఆసియా కప్‌కు కరోనా ముప్పు.. ఇద్దరు ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్

ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2023 ప్రారంభానికి ముందు అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందుతోంది. శ్రీలంక ఆటగాళ్లు అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన జట్టు యాజమాన్యం.. మిగతా ప్లేయర్లు కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడుతోంది.

ఆసియా కప్ 2023 ప్రారంభానికి ఐదు రోజుల సమయం మాత్రం మిగిలివుంది. ఇలాంటి సమయంలో ఇదొక చేదువార్త అనే చెప్పాలి. మొన్నటివరకూ శ్రీలంక ప్రీమియర్ లీగ్(ఎస్ పీఎల్) వీరిద్దరూ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరితో సన్నిహితంగా మెలిగిన మరికొందరిపై అనుమానాలు రేకిస్తున్నాయి. దీంతో ఆసియా కప్ టోర్నీలో పాల్గొనే శ్రీలంక జట్టు పరిస్థితి ఏంటా అన్నది అర్థమవ్వడం లేదు. ఇప్పటికే ఆ జట్టు స్టార్ ప్లేయర్ వాహిండు హసరంగ గాయంతో ఈ టోర్నీలో ఆడేది అనుమానంగా మారగా.. తాజాగా ఇద్దరు కీలక ఆటగాళ్లు కరోనా బారిన పడటం ఆ జట్టులో ఆందోళన రేకెత్తించింది.

హైబ్రిడ్ మోడల్

ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఆసియా కప్ టోర్నీకి ఈసారి పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.  ఆసియా కప్ జరగనుంది. వాస్తవానికి ఈ  టోర్నీ పాకిస్థాన్‌లో జరగాల్సి ఉన్నా.. భారత్ అభ్యంతరం చెప్పడంతో హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. దీంతో పాకిస్థాన్‌ వేదికగా 4 మ్యాచులు, శ్రీలంక వేదికగా 9 మ్యాచులు నిర్వహించనున్నారు. భారత్ ఆడే మ్యాచులన్నీ శ్రీలంకలో జరగనున్నాయి.

ఆగస్టు 31న తొలి మ్యాచ్

ఆగస్టు 31న బంగ్లాదేశ్‌తో.. శ్రీలంక తన తొలి మ్యాచ్ ఆడాల్సిఉంది. అందుకు మరో ఆరు రోజులు సమయం మాత్రమే ఉంది. అప్పటివరకు అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరాలు కోలుకోవాలని శ్రీలంక మేనేజ్మెంట్ జట్టు ఆశిస్తోంది. ఒకవేళ వారు కోలుకోకపోతే.. వారి స్థానాలను ఇతర ఆటగాళ్లతో భర్తీ చేసే అవకాశం ఉంది.

కాగా, శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఆసియా కప్ 2023 కోసం తమ జట్టును ఇంకా ప్రకటించలేదు.