మావోయిస్టుల మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు మృతి

మావోయిస్టుల మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు మృతి
  •     నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు
  •     ఛత్తీస్​గఢ్​లోని బీజాపూర్ ​జిల్లాలో ఘటన

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బీజాపూర్​జిల్లాలో గురువారం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు చనిపోగా, మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హెలీక్యాప్టర్​లో రాయ్​పూర్​దవాఖానకు తరలించారు. బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల బార్డర్​లో మావోయిస్టు పార్టీకి చెందిన దర్బా డివిజన్​ కమిటీ, మిలటరీ కంపెనీ-–2 దళాలు సంచరిస్తున్నాయనే పక్కా సమాచారంతో సీఏఎఫ్​, డీఆర్జీ, ఎస్టీఎఫ్​, సీఆర్​పీఎఫ్​ జవాన్లను ఈనెల 16న కూంబింగ్​కోసం పంపించారు.

కూంబింగ్​తర్వాత తిరిగి వస్తుండగా గురువారం తెల్లవారుజామున బీజాపూర్​జిల్లా తెర్రం పీఎస్​పరిధిలోని మండిమర్కా గ్రామ అడవుల్లో మావోయిస్టులు అంతకుముందే అమర్చిన మందుపాతర పేల్చారు. దీంతో ఎస్టీఎఫ్​కు చెందిన భరత్​లాల్​సాహూ, సతేర్​సింగ్​అనే జవాన్లు అక్కడికక్కడే మరణించారు. పురుషోత్తం నాగ్​, కోమల్​యాదవ, సియారాం సోరీ, సంజయ్​కుమార్​తీవ్రంగా గాయపడ్డారు.

అప్రమత్తమైన మిగిలిన జవాన్లు ప్రతిఘటించగా మావోయిస్టులు పారిపోయారు. మృతి చెందిన సతేర్​సింగ్​ది నారాయణ్​పూర్​జిల్లా బంహనా గ్రామం కాగా, భరత్​లాల్​సాహూది రాయ్​పూర్​జిల్లాలక్ష్మీనగర్​మోవా గ్రామం.  

గడ్చిరోలీలో  మావోయిస్టుల మృతదేహాల గుర్తింపు

మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా ఝరావండీ పీఎస్​పరిధిలోని వాందోళీ అటవీ ప్రాంతంలో సీ-60 బలగాల ఆపరేషన్​గురువారం కంప్లీట్​అయ్యింది. ఈ ఎన్​కౌంటర్​లో మొత్తం 12 మంది మావోయిస్టులు మరణించగా ఇందులో ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. వీరందరినీ గుర్తించారు. చట్​గావ్​-కాసనూర్​జాయింట్ ఎల్​ఓఎస్​కమాండర్​యోగేశ్​దేవ్​సింగ్​అలియాస్​నరేంద్ర(36), కోర్చీ-తిప్పాగఢ్​ ఎల్​ఓఎస్​ కమాండర్​ఆత్రం లక్ష్మణ్​(43), తిప్పాగఢ్​డివిజన్​కమిటీ మెంబర్​ప్రమోద్​లాల్సే(31), కాసనూర్​డిప్యూటీ కమాండర్​మహరు ధోబీ గాడ్వే(31)

కోర్చీ డిప్యూటీ కమాండర్​అనిల్​దేవ్సే అలియాస్​దేవా(28), కాసనూర్​ఏరియా కమిటీ మెంబర్​విజ్జు, ఛట్​గావ్​ఏరియా కమిటీ మెంబర్​సరితా జారా పర్సా(37), కాసనూర్​ఏరియా కమిటీ మెంబర్​రాజో మంగల్​సింగ్​గాడ్వే(35), ఛట్​గావ్​దళ మెంబర్​రోజా, కాసనూర్​దళ మెంబర్​సాగర్, తిప్పాగఢ్​దళ మెంబర్​ పోడియం చంద్రా, కోర్చీ పార్టీ మెంబర్​సీతాహవ్​కేలుగా గుర్తించారు. వీరందరిపై మహారాష్ట్ర ప్రభుత్వం రూ.84లక్షల రివార్డును ప్రకటించింది.

సంఘటనా స్థలం నుంచి 7 ఆటోమెటిక్​ వెపన్స్, 3 ఏకే-47లు, 2 ఇన్సాస్​లు, ఒక కార్బైన్​, ఒక ఎస్​ఎల్​ఆర్​, విప్లవసాహిత్యం, డిటోనేటర్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ గడ్చిరోలీలో మావోయిస్టు పార్టీకి ఇది గట్టి ఎదురుదెబ్బ అని, దళమే తుడిచి పెట్టుకుపోయిందని పోలీసులు ప్రకటించారు. గడ్చిరోలీ డిప్యూటీ ఎస్పీ విశాల్​నాగర్​గోజే ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్​ సక్సెస్​ అయినట్లు తెలిపారు. 

ఎన్​కౌంటర్​లో మహిళా మావోయిస్టు మృతి

దంతెవాడ జిల్లా కిరండోల్​పీఎస్​పరిధిలోని పురంగేల్​-ఈర్లగూడెం గ్రామ అడవుల్లో గురువారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఒక మహిళా మావోయిస్టు మరణించింది. బస్తర్​ఫైటర్స్, డీఆర్​జీ బలగాలు కూంబింగ్​ చేస్తున్న టైంలో మావోయిస్టులు అంబుష్​ చేసి దాడికి పాల్పడ్డారు. తేరుకున్న బలగాలు వెంటనే కాల్పులు జరపడంతో మావోయిస్టులు పారిపోయారు. ఘటనాస్థలంలో వెతకగా మహిళా మావోయిస్టు మృతదేహంతో పాటు ఆయుధాలు, మావోయిస్టుల సామగ్రి లభ్యమయ్యాయి. కాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయపడ్డారని బలగాలు చెబుతున్నాయి.