- గల్లంతైన వారిని వదిలేసి ఇండ్లకు వెళ్లిన మిగతా ఫ్రెండ్స్
- పిల్లలు రాకపోవడంతో ప్రశ్నించిన పేరెంట్స్
- జరిగింది చెప్పిన ఓ విద్యార్థి
- భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి, రంగాపురం గ్రామాల్లో విషాదం
మొగుళ్ళపల్లి, వెలుగు : బడికి వెళ్లకుండా పార్టీ చేసుకున్న ఏడుగురు 9వ తరగతి విద్యార్థులు తాగిన మైకంలో ఈతకు వెళ్లగా, ఇద్దరు చనిపోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాల మోడల్ స్కూల్లో వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. రంగాపురానికి చెందిన ఒకరు, లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒకరు, ఇస్సిపేటకు చెందిన ముగ్గురు ఆర్టీసీ బస్సులో కొరికిశాల స్కూల్కు బయలుదేరారు. అయితే, వీరు స్కూల్రాకముందే మొగుళ్లపల్లిలో దిగారు. ఇక్కడ అఖిల్, మరో విద్యార్థి జత కలిశాడు. వీరంతా బడికి వెళ్లకుండా స్కూల్బ్యాగులు తీసుకుని గ్రామ శివారులోని వాగు ఒడ్డు ప్రాంతానికి వెళ్లారు.
బ్యాగులను డంపింగ్ యార్డు ప్రాంతంలో పెట్టి వాగు ఒడ్డున పార్టీ చేసుకున్నారు. తాగిన తర్వాత మైకంలో ఈత కొట్టడానికి వాగులోకి దిగారు. వీరిలో మొగుళ్లపల్లికి చెందిన బండారి కొమురయ్య, సమ్మక్కల రెండో కొడుకు అఖిల్(14), రంగాపురానికి చెందిన కుమారస్వామి, కావ్యల కొడుకు ఉరుసుల హర్షవర్ధన్(14) నీట మునిగి గల్లంతయ్యారు. భయపడిన తోటి విద్యార్థులు వాగు నుంచి బయటకు వచ్చారు. విషయం బయటపడితే తమను ఎవరైనా ఏమైనా అంటారేమోనన్న భయంతో గల్లంతైన విద్యార్థుల బట్టలు, చెప్పులు వాగులో పడేసి ఎవరి ఇండ్లకు వారు పోయారు. వెళ్లేప్పుడు వారి బ్యాగులను మాత్రమే తీసుకువెళ్లి అఖిల్, హర్షవర్ధన్బ్యాగులను వదిలేసి పోయారు. ఒంటిపూట బడులు నడుస్తుండడంతో మధ్యాహ్నం మూడు గంటలు దాటినా ఇద్దరు విద్యార్థులు ఇండ్లకు రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
వెంటనే స్కూల్కు కాల్ చేయడంతో వారు బడికి రాలేదని సమాధానం చెప్పారు. మొగుళ్లపల్లికే చెందిన మరో విద్యార్థిని అడగ్గా తాము కల్లు తాగి ఈత కొట్టేందుకు వాగులోకి దిగామని, తర్వాత వారు మునిగి పోవడంతో ఇంటికి వచ్చినట్టు చెప్పాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించగా ఎస్సై శ్రీధర్ ఈతగాళ్లతో నీటిలో గాలించగా అర్ధరాత్రి ఒకరిది, తెల్లవారుజామున మరొక విద్యార్థి శవం దొరికింది. విద్యార్థుల మృతిపై తమకు అనుమానాలున్నాయని వారి పేరెంట్స్ పోలీసులకు కంప్లయింట్చేశారు. బీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ గండ్ర జ్యోతి,కాంగ్రెస్ లీడర్ గండ్ర సత్యనారాయణ రావు, జడ్పీటీసీ సదయ్య, సర్పంచ్ ధర్మారావు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.