వాంకిడి ఫుడ్ పాయిజన్.. ఇద్దరు స్టూడెంట్స్ హైదరాబాద్ కు

వాంకిడి ఫుడ్ పాయిజన్.. ఇద్దరు స్టూడెంట్స్ హైదరాబాద్ కు
  • స్థానిక పీహెచ్​సీలో ట్రీట్​మెంట్ పొందుతున్న మరో 14 మంది

ఆసిఫాబాద్, వెలుగు: వాంకిడి మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్థులు కోలుకుంటున్నరు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆదివారం హైదరాబాద్​కు తరలించారు. వాంకిడిలోని గవర్నమెంట్ హస్పిటట్​లో ట్రీట్​మెంట్ పొందుతున్న మరో 14 మంది ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. వారిని హాస్టల్ సిబ్బంది, డాక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నరు.

భయంతోనే విద్యార్థులు

గత నెల 30న మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 30 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. వెంటనే వారిని హాస్పిటల్​కు తరలించి ట్రీట్​మెంట్ అందించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. 

7, 6వ తరగతి చదువుతున్న జ్యోతిక, మహాలక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఆదేశాలతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​లోని నిమ్స్​కు తరలించినట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి చెప్పారు. హాస్టల్​లో ఫుడ్ పాయిజన్ ఘటన తర్వాత విద్యార్థులు కొంత భయంతోనే గడుపుతున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు ప్రతి రోజు వచ్చి తమ పిల్లల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. హాస్టల్​లో మొత్తం 591 మంది విద్యార్థులుండగా అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఫుడ్ పాయిజన్​కు గల కారణాలు ఇప్పటివరకు నిర్దారణ కాలేదు.

మెరుగైన వైద్యం అందించాలి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

వాంకిడి ఆశ్రమ పాఠశాలో ఫుడ్ పాయిజన్ ఘటన విచారకమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.  అస్వస్థతకు గురైన స్టూడెంట్స్​కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాలలోని మాక్స్ కేర్ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ పొందుతున్న ఆరుగురు స్టూడెంట్స్​ను ఆదివారం ఆమె పరామర్శించారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో సైతం పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.