ఛత్తీస్ గఢ్.. ఒరిస్సా సరిహద్దుల్లోని మెయిన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ సంచలనంగా మారింది. 2025, జనవరి 21వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఈ ఎన్ కౌంటర్లో 14 మంది నక్సల్స్ చనిపోయారు. భద్రతాబలగాలు, నక్సల్స్ మధ్య జరిగిన కాల్పుల్లో వీళ్లు చనిపోయినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయిన 14 మంది నక్సల్స్‌లో ఇద్దరు తెలంగాణ వాళ్లు ఉన్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హన్మంతు అలియాస్ రాజేశ్ తివారి స్వస్థలం నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామం. సిద్దిపేట జిల్లా కోహెడకు చెందిన కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ కూడా ఈ ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు.
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు నక్సలైట్లు కంచుకోట దండకారణ్యాన్ని గత రెండు రోజులుగా జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఛత్తీస్ గఢ్.. ఒరిస్సా సరిహద్దుల్లోని మెయిన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు రెండు రోజుల పాటు జరిగిన ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఎన్ కౌంటర్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉండటం గమనార్హం.
సెంట్రల్ కమిటీ మెంబర్, పార్టీ కీలక నేత చలపతి అలియాస్ రామచంద్రా రెడ్డి అలియాస్ జైరామ్ కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న చలపతి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. చలపతి హెడ్‌పై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోటి రివార్డు ప్రకటించాయి. ఈ ఎన్ కౌంటర్లో ప్రస్తుతం 14 మంది మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డట్లు అధికారులు ధృవీకరించారు. ఘటన స్థలంలో కాల్పులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.