స్టేషన్‌ఘన్‌పూర్ / హుజూరాబాద్, వెలుగు: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ స్టూడెంట్లు చనిపోయారు. మృతులను జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లికి చెందిన గౌతమ్ (20), హుజూరాబాద్‌కు చెందిన నివేశ్ (20)గా గుర్తించారు.
జ్యుయెల్లరీ షాపు నిర్వహిస్తున్న పార్శి కమల్‌కుమార్, పద్మ దంపతుల కొడుకు పార్శి గౌతమ్ , డాక్టర్ ముక్క నవీన్, స్వాతి దంపతుల కొడుకు ముక్క నివేశ్ ఇంజినీరింగ్ చదివేందుకు గత సంవత్సరం అమెరికా వెళ్లారు. అక్కడ అరిజోనా రాష్ట్రంలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నారు. ఎప్పట్లానే స్నేహితులిద్దరూ కలిసి కారులో కాలేజీకి వెళ్లారు.
తరగతులు పూర్తిచేసుకుని తిరిగి ఇంటికి కారులో వెళుతుండగా.. ఫీనిక్స్ సిటీ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు.. ముందు వెళుతున్న వారి వెహికల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌతమ్, నివేశ్ అక్కడికక్కడే చనిపోయారు. ఘటనకు సంబంధించి అరిజోనా పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొడుకుల మృతి వార్త తెలిసి కుటుంబ సభ్యులు షాక్ కు గురై తీవ్రంగా రోదించారు. అమెరికాలో దర్యాప్తు పూర్తయి మృతదేహాలు స్వదేశానికి చేరుకోవడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని పోలీసులు తెలిపారు.