స్నేహంలో స్వార్దానికి చోటు లేదు.స్నేహం త్యాగానికి మరో పేరని చెప్పచ్చు.అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడనిదే స్నేహం. ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. నీట మునిగిన స్నేహితుడిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు తెలుగు విద్యార్థులు.వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా కందుకూరికి చెందిన చైతన్య, బాపట్లకు చెందిన బొబ్బ సూర్యతేజలిద్దరూ ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారు.మంగళవారం మిలా మిలా వాటర్ ఫాల్స్ చూసేందుకు స్నేహితుడితో కలిసి వెళ్లారు చైతన్య, సూర్యతేజ.
ఈ క్రమంలో కాలుజారి ఆ స్నేహితుడు జలపాతంలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన చైతన్య, సూర్యతేజాలు కూడా లోయలో పడిపోయారు. స్నేహితుడు ఒడ్డుకు చేరుకోగా... నీట మునిగి ఊపిరాడక చనిపోయారు చైతన్య, సూర్యతేజ.తెలుగు విద్యార్థుల మరణవార్త వారి కుటుంబాల్లో పెనువిషాదం నింపింది.