భువనగిరిలో ఇద్దరు టెన్త్​ స్టూడెంట్ల ఆత్మహత్య

యాదాద్రి, వెలుగు : పదో తరగతి చదువుతున్న ఇద్దరు హాస్టల్​ స్టూడెంట్స్​ శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఈ ఘటన జరిగింది. హాస్టల్ ​ వార్డెన్​ శైలజ తెలిసిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్​కు చెందిన కె.భవ్య, జి.వైష్ణవి.. భువనగిరి బీచ్​ మహల్​ గవర్నమెంట్​ స్కూల్​లో టెన్త్​ క్లాస్​ చదువుతున్నారు. ఇద్దరూ భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్​లో ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఏడో తరగతి స్టూడెంట్లతో భవ్య అసభ్యకరంగా మాట్లాడిందని హాస్టల్​ వార్డెన్​కు సమాచారం అందింది. దీంతో భవ్య, ఆమె ఫ్రెండ్​ వైష్ణవిని హాస్టల్​కు తీసుకొచ్చారు. 

ఇద్దరికి నచ్చజెప్పిన అనంతరం అందరూ రాత్రి భోజనం చేశారు. ఆ ఇద్దరు మాత్రం ముభావంగా ఉండి భోజనం చేయకుండా గదిలోకి వెళ్లిపోయారు. రాత్రి గదిలోని ఫ్యాన్ కు చున్నీలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన తోటి స్టూడెంట్లు హాస్టల్​ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకొని భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే వారిద్దరు చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. హాస్టల్​ స్టాఫ్​ను పోలీసులు ప్రశ్నించగా మధ్యాహ్నం స్కూల్ లో గొడవ జరిగిందని చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.