హైదరాబాద్/నల్లగొండ: అడుగే కదిలింది.. తోడై నిలిచింది.. ఊరే కదిలింది.. దారై సాగింది.. అన్న చందంగా బెల్టుషాపులు లేని మునుగోడు ఆవిష్కృతమైంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపు కొత్త అధ్యాయానికి మలుపుగా మారింది. మద్యం మత్తులో అనేక కుటుంబాలు ఆగమైపోతున్నాయని, తాను ఎమ్మెల్యేగా గెలువగానే బెల్టుషాపులను రద్దు చేస్తానని మాట ఇచ్చిన కోమటిరెడ్డి దానిని నెగ్గించుకున్నారు. తన పదవి కంటే బెల్ట్ షాపుల నిర్మూలనే ముఖ్యమని అనేక సమావేశాల్లో చెప్పిన కోమటిరెడ్డి ఎమ్మెల్యేగా గెలవగానే కార్యాచరణ ప్రారంభించి విజయం సాధించారు. ఇందుకోసం ఆయన ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగి నెల రోజుల వ్యవధిలోనే బెల్ట్ షాపులను నిర్మూలించారు.
ప్రత్యేక కమిటీలు.. ప్రజా చైతన్యం
మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి గెలుపొందగానే.. ఏడు మండలాల్లోని 159 గ్రామ పంచాయతీలు, రెండు మండలాల పరిధిలోని 30 వార్డుల్లో బెల్టు షాపుల నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలు వేశారు. ఈ కమిటీలు బెల్టు షాపులను గుర్తించి వాటిని నడుపుతున్న వారికి కౌన్సెలింగ్ చేశాయి. ఇందుకు ఎక్సైజ్, పోలీసు అధికారులు సహకరించారు. బెల్టుషాపులపై ఆధారపడి ఉన్న కుటుంబాల జాబితాను తెప్పించుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ పరంగా, తాను వ్యక్తిగతంగా సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. దీంతో వాళ్లంతా స్వచ్ఛందంగా బెల్టుషాపుల నిర్వహణ నుంచి తప్పుకొన్నారు. దీంతో మునుగోడు సెగ్మెంట్ పరిధిలో 2 వేల బెల్టు షాపులు మూతపడ్డాయి. తన పిలుపునకు సహకరించి బెల్ట్ షాపులను తీసేసిన కుటుంబాలతో ఎమ్మెల్యే స్వయంగా భేటీ కానున్నారు.