రెండు వేల ఏండ్ల కంప్యూటర్ మిస్టరీ బ్రేక్‌‌

రెండు వేల ఏండ్ల కంప్యూటర్ మిస్టరీ బ్రేక్‌‌

ఇప్పుడు ఉన్నట్టు టెలిస్కోప్‌‌లు, శాటిలైట్లు లేకుండానే వేల ఏండ్ల క్రితమే గ్రహాలను, గ్రహణాలను, ఇంకా అనేక ఖగోళ విశేషాలను మన పూర్వీకులు లెక్కగట్టి కచ్చితంగా చెప్పారు. మన దేశంతో పాటు కొన్ని ప్రాచీన నాగరికతల్లో ఇది ఎలా సాధ్యమన్నది నేటికీ అంతుచిక్కని విషయమే. అయితే ఇలాంటి ఖగోళ సంబంధ విషయాలను లెక్క గట్టేందుకు దాదాపు 2100 ఏండ్ల క్రితం గ్రీకు నాగరికతలో ఒక మెకానికల్ కంప్యూటర్‌‌‌‌ను వాడేవారని సైంటిస్టులు గుర్తించారు.1901లో గ్రీస్ ద్వీపం అంటికిథెరా వద్ద సముద్రంలో దొరికిన ఆ కంప్యూటర్‌‌‌‌ అవశేషాలు ఆధారంగా దీనికి సంబంధించిన మిస్టరీని బ్రేక్ చేశారు.

ప్రపంచంలోనే అత్యంత పురాతన కంప్యూటర్ అది. ఇప్పుడు మనం వాడుతున్న మామూలు కంప్యూటర్‌‌‌‌ లాంటిది కాదది. వేల ఏండ్ల క్రితమే వాడిన ఆస్ట్రానమిక్ కాలిక్యులేటర్. అంతరిక్షంలోని గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి? వాటి ఆధారంగా ఏర్పడే గ్రహణాలు ఎప్పుడు వస్తాయి? వంటి అనేక విషయాలను లెక్కగట్టేందుకు ప్రాచీన గ్రీకులు వాడిన కంప్యూటర్ అది. దీనిని రాగితో తయారు చేశారు. భారీ సైజులో ఉండే ఈ మెకానికల్ కంప్యూటర్‌‌ అనేక పళ్ల చక్రాలు, పెద్ద పెద్ద స్తంభాలతో రూపుదిద్దుకొన్నది.
 

సముద్ర గర్భంలో దొరికితే, రీసెర్చ్..
ప్రాచీన గ్రీకులు దాదాపు 2000 ఏండ్ల క్రితం వాడిన మెకానికల్ కంప్యూటర్‌‌‌‌ను క్రీస్తు పూర్వం తొలి శతాబ్ధంలో ఓ నౌకలో తీసుకుని వెళ్తుండగా అది మునిగిపోయింది. ఇది అనూహ్యంగా 1901 సంవత్సరంలో కొందరు డైవర్స్‌‌కు గ్రీస్ ద్వీపమైన అంటికిథెరా వద్ద  సముద్ర గర్భంలో దాని ముక్కలు కనిపించాయి. ఈ విషయం తెలియడంతో గ్రీస్, లండన్ శాస్త్రవేత్తలు కలిసి 82 ముక్కలను బయటకు తీశారు. నాటి నుంచి అసలు ఆ ముక్కలు దేనికి సంబంధించినవో కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. 2005 నాటికి ఆ పరిశోధనలు ఒక కొలిక్కి వచ్చాయి. ఆ ముక్కలన్నీ గ్రీకులు ఖగోళ విశేషాలు తెలుసుకునేందుకు వాడిన కంప్యూటర్ అని శాస్త్రవేత్తలు తేల్చారు. కానీ ఆ ముక్కలన్నింటినీ ఒక ఆర్డర్‌‌‌‌లో పెట్టి దానిని మళ్లీ రీకన్‌‌స్ట్రక్ట్ చేయడం ఎలా అన్నది పెద్ద మిస్టరీగా మారిపోయింది.

 

మిస్టరీ ఇట్ల బ్రేక్ చేసిన్రు
అంటికిథెరా దగ్గర సముద్రంలో దొరికిన ఈ కంప్యూటర్‌‌‌‌కు అంటికిథెరా కంప్యూటర్ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. అది వర్క్ చేసే విధానాన్ని అంటికిథెరా మెకానిజం అని పిలుస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ కాలేజీ శాస్త్రవేత్తలు సముద్రంలో దొరికిన ముక్కలను ఎక్స్‌‌రే స్కానింగ్ చేసి, వాటిపై ఉన్న గ్రీక్‌‌ లిపిని గుర్తించారు. ఆ రాగి ముక్కలపై ఉన్న విషయాలను ఒక ఆర్డర్‌‌‌‌లో పెట్టేందుకు గ్రీక్ మేథమెటీషియన్స్ సాయం తీసుకున్నారు. ఆ డేటాలో కొన్ని గ్రహాల పరిభ్రమణ కాలం వంటి విషయాలతో పాటు ఒక్కో పళ్ల చక్రం దేనికి సంకేతమనే వివరాలు ఉన్నాయి. దీని సాయంతో ఆ కంప్యూటర్ రీకన్‌‌స్ట్రక్షన్ సులభంగా చేయొచ్చని నిర్ణయానికి వచ్చిన్నట్లు ప్రొఫెసర్ టోనీ ఫ్రీత్ తెలిపారు. అయితే ఈ పని ఆ ముక్కలతో సాధ్యం కాదని, అందుకే డిజిటల్‌‌ మోడల్‌‌ను తయారు చేశామని చెప్పారు. ఆ ముక్కల్లో అన్ని భాగాలు ఉన్నప్పటికీ ఫ్రంట్ గేర్ లేకపోవడం వల్లే కొన్నేండ్లుగా రీకన్‌‌స్ట్రక్షన్ సాధ్యం కాలేదని, ఎక్స్‌‌రే ఇమేజెస్, వాటి స్కాన్ డేటా సాయంతో దాని మిస్టరీని కూడా బ్రేక్ చేసి డిజటల్‌‌గా ఆ పురాతన కంప్యూటర్ పార్ట్స్ అన్ని చేసి, వాటిని ఆర్డర్‌‌‌‌లో పెట్టామని వెల్లడించారు.

 

భూమి కేంద్రంగా..
నాటి గ్రీకులు భూమి కేంద్రంగా విశ్వం ఉందని భావించేవారు. చంద్రుడు, సూర్యుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని గ్రహాలు దాని చుట్టూ పరిభ్రమిస్తున్నాయని లెక్కలు వేసుకునేవారు. దీని ప్రకారమే అంటికిథెరా కంప్యూటర్ డిజైన్ కూడా ఉందని, అయితే బుధ, గురు, శుక్ర గ్రహాల పరిభ్రమణాన్ని నేటి లెక్కలకు సరిగ్గా అప్పట్లోనే అంచనా వేయగలిగారని ప్రొఫెసర్ టోనీ తెలిపారు. ఆ కంప్యూటర్ డిజైన్‌‌లో సెంటర్‌‌‌‌లో ఉన్న డోమ్‌‌ను భూమి అని, దానికి పక్కనే ఉన్న నల్లని డాట్‌‌ వంటిది చంద్రుడు అని, వెనుక భాగంలో ఒక్కో పళ్ల చక్రానికి సూర్యుడు, మిగిలిన గ్రహాలుగా నాడు గ్రీకులు లెక్కలేసుకున్నారు. ఈ పళ్ల చక్రాల మెకానిజం ఆధారంగా గ్రహగతులను లెక్కగట్టడం, గ్రహణాలను అంచనా వేయడంతో పాటు లూనార్ క్యాలెండర్, రాశి ఫలాలను రాసేవారని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ కంప్యూటర్ పైభాగంలో రాసిన కొన్ని గ్రహాల పరిభ్రమణ కాలం, గ్రహణాల అంచనా ఇలా అనేక అంశాలు కచ్చితంగా ఉన్నాయని తెలిపారు.

 

వందేండ్లకు పైగా పట్టడానికి కారణం
1901లోనే దొరికిన అంటికిథెరా కంప్యూటర్‌‌‌‌ను రీడిజైన్ చేయడానికి వందేండ్లకు పైగా పట్టడానికి ప్రధాన కారణం మొదటిది దానిపై ఉన్న స్క్రిప్ట్‌‌ చెదిరిపోకుండా డేటా కరెక్ట్‌‌గా సేకరించే టెక్నాలజీ తొలినాళ్లలో అందుబాటులో లేకపోవడమే. అలాగే సముద్రంలో దొరికింది ఆ కంప్యూటర్‌‌‌‌లో మూడో వంతు భాగమే. అందులోనూ 62 భాగాలు పళ్ల చక్రాలే ఉన్నాయి. వాటితో పాటు దొరికిన ఫ్రంట్, బ్యాక్ ప్యానెల్స్‌‌పై ఉన్న స్క్రిప్ట్‌‌ ఆధారంగా పూర్తి స్థాయిలో డిజైన్ చేయగలిగినట్టు లండన్ సైన్స్ మ్యూజియం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం క్యూరేటర్ మైకెల్ రైట్ తెలిపారు. దీని పూర్తి రీడిజైన్‌‌లో అనేక దేశాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారని, దాని ముక్కలపై దొరికిన అతి కొద్ది డేటా పరిశీలించగా బుధుడు, శని గ్రహాల పరిభ్రమణం 400 ఏండ్లకు పైగా కాలం గ్రీక్స్ అంచనా వేశారని, అవి కచ్చితంగా ఉన్నాయని రీసెర్చ్ టీమ్ మెంబర్ ఎరిస్ డకానలిస్ చెప్పారు. 

ఇన్నోవేటివ్ మెకానిజం
అంటికిథెరా కంప్యూటర్‌‌‌‌లో ఉన్న వాటికంటే తక్కువ గేర్లతో పని చేసేలా కొత్త సిస్టమ్‌‌ను డిజైన్‌‌ చేశామని ప్రొఫెసర్ టోనీ ఫ్రీత్ తెలిపారు. ఆ సిస్టమ్‌‌తో అన్ని గ్రహాల ఆస్ట్రానమికల్ సైకిల్స్​ను లెక్క గట్టగలిగేలా కొత్త ఇన్నోవేటివ్ మెకానిజాన్ని తమ టీమ్ రూపొందించిందన్నారు. నాటి మెకానిజం ఉన్న తీరులోనే ఇది కూడా డిజైన్ చేశామని, ఇంత వరకు సక్సెస్ అయినప్పటికీ ఆ పురాతన టెక్నిక్స్‌‌ను ఇప్పుడు మళ్లీ మెకానికల్‌‌గా రుజువు చేయడం పెద్ద చాలెంజ్ అని ఆయన అన్నారు.