వేటగాళ్ల ఉచ్చులో పులులు.. మూడు రోజుల్లో రెండు మృతి

వేటగాళ్ల ఉచ్చులో  పులులు 
కాగజ్​నగర్ ​ఫారెస్ట్ ​రేంజ్​లో మూడు రోజుల్లో రెండు మృతి
పశువుపై విష ప్రయోగం.. ఆపై పులికి ఉచ్చు బిగింపు
కళేబరాన్ని తిన్న మూడు పులులు.. అందులో రెండు మృత్యువాత
మూడో పులి మృతిపైనా అనుమానం.. జాడ కోసం గాలింపు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన  రాష్ట్ర పీసీసీఎఫ్ డోబ్రీయాల్

 

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రేంజ్ అటవీ ప్రాంతంలో మూడు రోజుల్లో రెండు పులులు మృతి చెందాయి. రెండు పులుల మధ్య కొట్లాటలో ఓ పులి చనిపోయినట్లు చెప్పుకొచ్చిన అధికారులు.. రెండో పులి కళేబరం దొరకడంతో మాట మార్చారు. చనిపోయిన రెండో పులి మెడకు ఉచ్చు ఉందని, అది తిన్న పశువుపై విష ప్రయోగం జరిగినట్లు అనుమానం ఉందని రాష్ట్ర పీసీసీఎఫ్ డోబ్రియాల్ తెలిపారు. మృతి చెందిన రెండో పులిని మంగళవారం ఆయన పరిశీలించారు. కాగా విష ప్రయోగం జరిగిన పశువు కళేబరాన్ని మొత్తం మూడు పులులు తిన్నాయని విశ్వసనీయంగా తెలుస్తున్నది. వాటిలో ఇప్పటి వరకు రెండు మృతిచెందగా, మరో పులి మృతిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు దాని జాడ కోసం గాలిస్తున్నారు.

మొన్న కె -15.. నిన్న ఎస్​-9

కాగజ్ నగర్ ఫారెస్ట్​డివిజన్ దరిగాం అడవుల్లో గత మూడు రోజుల క్రితం మృతిచెందిన ఆడ పులిని అధికారులు కె–15(ఏడాదిన్నర వయసు)గా గుర్తించారు. అది చనిపోయిన కూతవేటు దూరంలోనే మరో పెద్ద పులి కళేబరం దొరకడం, దాని మెడకు ఉచ్చు బిగించి ఉండటం కలకలం రేపింది. దీన్ని ఎస్ –9 మగ పులిగా గుర్తించారు. ఎస్​– 9 వేటాడిన పశువు కళేబరానికి వేటగాళ్లు విషప్రయోగం చేసి ఉంటారని, ఆ కళేబరాన్ని కె–15, ఎస్​–9 పులులతో పాటు మరో పులి కూడా తిన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరో పులి మృతిపైనా అనుమానం రావడంతో దాని జాడ కోసం దరిగాం, మాలిని, మానిక్ పటార్, రేగులగూడ, వాంకిడి మండలం సర్కెపల్లి, అటవీ ప్రాంతాల్లో టైగర్ ట్రాకర్స్ తో పాటు జిల్లా ఫారెస్ట్ బృందాలతో గాలిస్తున్నారు. అయితే మొదటి పులి కళేబరం దొరికినప్పుడు రెండు పులులు కొట్లాడుకొని చనిపోయి ఉంటాయని చెప్పిన ఫారెస్ట్​ అధికారులు.. మీడియాకు తెలియకుండానే మొదటి పులిని దహనం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పులి మృతిని చిన్నగా చేసి చూపే ప్రయత్నంలో.. మరో పెద్ద పులి మెడకు ఉచ్చుతో చనిపోవడంతో అసలు విషయాలు బయటకొస్తున్నాయి.  

నాడు డజన్.. ఇప్పుడు ఐదేనట

మహారాష్ట్రలోని తాడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​కు ఆనుకొని ఉన్న కాగజ్ నగర్​టైగర్​కారిడార్​కు పెద్దసంఖ్యలో పులులు రాకపోకలు సాగిస్తున్నాయి.  2014లో ఫాల్గుణ అనే పులి కాగజ్​నగర్​లో నాలుగు పిల్లలకు జన్మనివ్వడంతో ఇక్కడ పులుల సంతతికి బీజం పడింది. అప్పటి నుంచి ఈ కారిడార్​లో కనీసం డజను వరకు పులులు ఉంటాయని ఫారెస్ట్​ ఆఫీసర్లు అనధికారికంగా చెప్తూ వచ్చారు. కానీ తాజాగా అటవీ శాఖ చీఫ్ డోబ్రియాల్ కాగజ్​నగర్​కారిడార్​లో కేవలం ఐదే పులులు ఉన్నాయని ప్రకటించడం గమనార్హం. పులుల సంఖ్యను తగ్గించి చూపుతున్నారనే అనుమానాలు వస్తున్నాయి. కాగా ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలో వేటగాళ్ల ఉచ్చులకు పులులు బలవుతూనే ఉన్నాయి. 2016లో మంచిర్యాల జిల్లా పిన్నారం అడవుల్లో వేటగాళ్ల ఉచ్చుకు ఓ మగపులి బలైంది. 2018లో జైపూర్ మండలం శివ్వారం ఫారెస్ట్​లో ప్రవేశించిన రాయల్  బెంగాల్ టైగర్​ను కరెంట్ షాక్​తో మట్టుబెట్టారు. పులుల సంతతి వృద్ధి చెందడానికి కారణమైన ఫాల్గుణ కొన్నేండ్లుగా జాడలేదు. దాని సంతానం కే-4 ఆడపులి చెన్నూర్ ఫారెస్ట్​లో రెండేండ్ల కింద మాయమైంది. ఫాల్గుణ మరో సంతానం వైశాఖ అనే పులి మంచిర్యాల ఏరియాలో వేటగాళ్ల ఉచ్చుకు బలైంది. తాజాగా రెండు పులులు చనిపోగా.. మరో పులి జాడ దొరకడం లేదు. కోట్ల ఖర్చుతో కవ్వాల్​ టైగర్​జోన్​ ఏర్పాటు చేసినా, అందులోకి పులులు రాకపోగా,   కాగజ్​నగర్ ​కారిడార్​లో ఉన్న పులులను, వాటి పిల్లలను అధికారులు కాపాడలేకపోతున్నారు.

విచారణ చేపడుతున్నం: డోబ్రియాల్​

కాగజ్ నగర్ రేంజ్ పరిధిలోని దరిగాం అటవీ ప్రాంతంలో పీసీసీఎఫ్ డోబ్రీయాల్ మంగళవారం పర్యటించారు. పులి కళేబరాన్ని పరిశీలించి, దాని మృతి వివరాలు వెల్లడించారు. ‘‘చనిపోయిన పెద్దపులి కాగజ్ నగర్ కు చెందిన ఎస్–9గా గుర్తించాం. పులి మెడకు ఉచ్చు బిగుసుకుని ఉంది. పులి మీద విష ప్రయోగం జరిగినట్లు అనుమానం ఉంది. పులి కళేబరం శాంపిల్స్​మూడు ల్యాబ్​లకు పంపిస్తున్నాం. మృతికి ముందు పులి దాడి చేసి హతమార్చిన పశువు కళేబరం చూశాం. దాని ద్వారానే విష ప్రయోగం జరిగినట్టు అనుమానం ఉంది. ఎస్–9 వయసు ఆరేళ్లు ఉంటుంది. దాదాపు నాలుగు రోజుల కిందట మృతి చెంది ఉండొచ్చు. పులుల మృతిపై  సీరియస్ గా విచారణ చేస్తున్నాం. ల్యాబ్ రిపోర్ట్ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం. మృతి చెందిన పులి కళేబరానికి ఎన్ టీసీఏ ప్రొటోకాల్ ప్రకారం దహనం చేశాం”అని ఆయన తెలిపారు.