ఆకాశాన్నంటుతున్న టమోటా ధరలు చాలా మంది ప్రజల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అయితే ఈ ధర పెరుగుదల మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలో భార్యాభర్తల మధ్య గొడవకు కూడా కారణమైంది. టిఫిన్ సర్వీస్ నడుపుతున్న సంజీవ్ బర్మన్.. ఇటీవల భోజనం వండేటప్పుడు రెండు టమోటాలు వాడడంతో దంపతుల మధ్య పెద్ద గొడవ జరిగింది.
టొమాటోల వాడకం గురించి అతని భార్య తనను సంప్రదించకపోవడంతో కలత చెందిందని ఈ సందర్భంగా బర్మన్ తెలిపాడు. అయితే వారిద్దరి మధ్య గొడవ అనంతరం.. ఆమె అలిగి తన ఇంటిని విడిచి పెట్టి వెళ్లిపోయింది. ఆ తర్వాత బర్మన్ ఎంత వెతికినా భార్య ఆచూకీ కనుగొనలేకపోయాడు. ఇక చేసేదేం లేక అతను స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
తాను వండుతున్న వెజిటబుల్ డిష్ లో రెండు టమాటాలు వేయడం వల్లే వాగ్వాదం మొదలైందని సంజీవ్ తెలిపాడు. మూడు రోజులుగా తన భార్యతో మాట్లాడలేదని, ఆమె ఎక్కడుందో తెలియదని చెప్పాడు. సంజీవ్ భార్యను వెతుకుతున్నామని, ఆమె త్వరలోనే తిరిగి వస్తుందని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.