బాన్సువాడ, వెలుగు : భవానీ మాలధారణ స్వాములపై మద్యం మత్తులో ఇద్దరు గిరిజన యువకులు దాడి చేశారు. ఈ ఘటన బాన్సువాడ మండలం కొయ్యగుట్ట వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గాలిపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు భవానీ మాలధారణ స్వాములు ద్విచక్రవాహనంపై కొయ్యగుట్టకు వెళ్తున్నారు. అదే సమయంలో బాన్సువాడ మండలం జేకే తండాకు చెందిన ఇద్దరు గిరిజనులు తమ బైక్వేగంగా వచ్చి స్వాములు వెళ్తున్న బైక్ను ఢీకొట్టారు.
దీంతో గిరిజన యువకులు దీక్ష స్వాములను కొట్టారు. అంతటితో ఆగకుండా స్వాముల మెడలోని మాలను ఆవేశంతో తెంపి వేశారు. దీంతో ఆగ్రహించిన స్వాములు పోలీస్ స్టేషన్ కు వెళ్లి రాస్తారోకో చేపట్టారు. వీరికి అండగా భవానీ మాలధారణ స్వాములు వచ్చి రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా బాధిత స్వాములు మాట్లాడుతూ జేకే తండాకు చెందిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో వచ్చి తమ వాహనాన్ని ఢీకొట్టారని తెలిపారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు సముదాయించి న్యాయం చేస్తామని తెలపడంతో స్వాములు ఆందోళన విరమించారు.