భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు ఆదివాసీలను మావోయిస్టులు హత్య చేశారు. తెర్రం పోలీస్‌స్టేషన్ పరిధిలోని చుత్వాహి గ్రామంలో ఈ ఘటన జరిగింది. వారి వారి ఇండ్లలో నిద్రిస్తున్న మడవి జోగా, మడవి హుంగాలను సాయుధ మావోయిస్టులు కిడ్నాప్ చేసి సమీప అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ప్రజాకోర్టు నిర్వహించి గొడ్డళ్లు, కత్తులతో నరికి, పొడిచి చంపారు. మృతదేహాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మృతులిద్దరూ అన్నదమ్ములు. గ్రామంలో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు ఏర్పాటుకు వీరిద్దరూ తమ భూమిని ఇచ్చారు. బేస్‌క్యాంపు ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు గతంలో వీరిద్దరినీ భూమి ఇవ్వొద్దని హెచ్చరించారు.
తమ మాటను ఖాతరు చేయకుండా భూమిని ఇచ్చి, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే వారిని హత్య చేశారు. సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపునకు 500 మీటర్ల దూరంలోనే ప్రజాకోర్టు నిర్వహించి హత్య చేయడం కలకలం రేపింది. బీజాపూర్ఎస్పీ జితేంద్రయాదవ్ సంఘటనా స్థలానికి బలగాలను పంపించారు. ఇటీవల దండకారణ్యంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులు భారీ సంఖ్యలో చనిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 91 మంది బలయ్యారు. ఈ నేపథ్యంలో తమ దళాల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్న వారిని ఏరివేతకు నిర్ణయించి ఇన్ఫార్మర్లను మట్టుబెడుతున్నారు. ఈ ఘటనలతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ బార్డర్‌లోని ఆదివాసీ పల్లెలు
వణుకుతున్నాయి.