భూపాలపల్లి జిల్లాలో ఘోరం : డబ్బా పాలు తాగిన చిన్నారి కవలలు మృతి

భూపాలపల్లి జిల్లాలో ఘోరం : డబ్బా పాలు తాగిన చిన్నారి కవలలు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. డబ్బా పాలు తాగిన నాలుగు నెలల కవలలు మృతి చెందిన ఘటన అందరిని కలిచివేస్తోంది. పసికందులు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, చిన్నారుల తల్లిదండ్రులు  కన్నీరు మున్నీరవుతున్నారు.

 కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అసలేం జరిగిందంటే..? భూపాలపల్లి జిల్లాలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన మర్రి అశోక్ -లాస్య దంపతులకు నాలుగు నెలల క్రితం  ఇద్దరు కవల పిల్లలు జన్మించారు.  దీంతో తల్లి లాస్య ఇద్దరు చిన్నారులతో కలిసి తన  అమ్మవాళ్ళ ఊరు నగరంపల్లిలో  ఉంటుంది. ఫిబ్రవరి 22న ఇద్దరు చిన్నారులకు పాల పౌడర్ కలిపి  ఇద్దరు పిల్లలకు పట్టించింది.   డబ్బా పాలు పట్టించి పిల్లలను పడుకోబెట్టిన తర్వాత అకస్మాత్తుగా ముక్కులో నుంచి పాలు కారాయి.. ముక్కులో నుంచి పాలు రావడంతో  వెంటనే  స్థానిక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా హార్ట్ బీట్ లేదని చెప్పాడు. స్థానిక డాక్టర్ సూచనతో వెంటనే చిన్నారులను భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు  తరలించారు. ఇద్దరు కవల పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చనిపోయినట్టు తేల్చారు డాక్టర్లు. 

చిన్నారుల మృతితో  బోరున విలపిస్తున్నారు కుటుంబసభ్యులు. ఇద్దరు కవల పిల్లలు చనిపోవడంతో నగరంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు చెప్పినట్లు  చిన్నారుల మృతికి  డబ్బా పాలే కారణమా? లేక వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.