
యూకేకు చెందిన ఇద్దరు ఎంపీలను ఇజ్రాయెల్ అధికారులు నిర్భంధించారు. అధికార లేబర్ పార్టీకి చెందిన ఎంపీలు యువాన్ యాంగ్, అబ్టిసామ్ మొహ్మద్ లు లండన్ నుంచి ఇజ్రాయెల్ కు వెళ్ళగా ఆదివారం(ఏప్రిల్6) విమానాశ్రయంలోనే వారిని నిర్భంధించారు ఇజ్రాయెల్ అధికారులు.దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని బ్రిటిష్ మీడియా వెల్లడించింది.
ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన పార్లమెంటరీ ప్రతినిధి బృందంలోని ఇద్దరు బ్రిటీష్ ఎంపీలను ఇజ్రాయెల్ అధికారులు అడ్డుకోవడం కరెక్ట్ కాదని, ఎంపీల నిర్భంధాన్ని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ తీవ్రంగా ఖండించారు. బ్రిటీష్ పార్లమెంటేరియన్లపై ఇలా వ్యవహరించడం తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
యుద్దం స్వల్పకాలిక విరమణ తర్వాత మార్చిలో మళ్లీ ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి గాజాపై ఇజ్రాయెల్ బాంబుదాడులను తీవ్రం చేసింది. 1249 మంది చనిపోయారు.
ఇజ్రాయెల్ హమాస్ యుద్దం ప్రారంభమైనప్పటినుంచి మొత్తం 50వేల 609 మంది ప్రాణాలు కోల్పోయారని హమాస్ ఆధీనంలో ఉన్న గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ లో 1218 మంది చనిపోయినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. వారిలో ఎక్కువ మంది పౌరులున్నట్లు వెల్లడించింది.